జగన్‌పై చిరంజీవి దూకుడు

జగన్‌పై చిరంజీవి దూకుడు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై కాంగ్రెసు పార్టీ నాయకులు దూకుడు పెంచారు. అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభా నియోజకవర్గంలో ప్రచారం చేసిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాడని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇంటిలో రెండు మూడు వందల పడక గదులు కట్టుకున్న వైయస్ జగన్ ప్రజలకు ఎలా సేవ చేస్తాడని ఆయన అడిగారు. 

వైయస్ జగన్ పేదల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను విమర్శిస్తున్నారు గానీ తాను తప్పు చేయలేదని జగన్ ఎక్కడా చెప్పడం లేదని ఆయన అన్నారు.  చిరంజీవి  దగ్గరకు రావడానికి కొంత మంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. 

ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు దాదాగిరికి, గాంధీగిరికి మధ్య జరుగుతున్న యుద్ధమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు  లగడపాటి రాజగోపాల్  అన్నారు.  ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో తాను పాదయాత్ర చేస్తానని, గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలో చెప్పారు. భాను కిరణ్, మంగలి కృష్ణవంటివారితో జగన్‌కు సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. జగన్ సేవ చేస్తానంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. 

వైయస్ జగన్‌ను అరెస్టు చేయక తప్పదని ఆయన అన్నారు. ముడుపులు తీసుకున్నవారంతా అరెస్టు కావాల్సిందేనని ఆయన అన్నారు. వారిని ఎందుకు అరెస్టు చేయకూడదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తన అరెస్టుకు కుట్ర పన్నుతున్నాయని జగన్ అనడం హాస్యాస్పదని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చెప్పాయా అని ఆయన అడిగారు. కాంగ్రెసుది పెట్టే పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెసుది కొట్టే పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ అక్రమాల గురించి తాము అప్పుడే చెప్పామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. అది నిజమని సిబిఐ దర్యాప్తులో తేలుతోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ఎజెండాను పార్టీ ఎజెండాగా చిత్రీకరించారని ఆయన విమర్శించారు. కార్పొరేట్ వ్యవస్థను  వైయస్ జగన్  నాశనం చేశాడని, ఆ ఘనత జగన్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. 

జలయజ్ఞంలో అక్రమాలపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశానని, ఓ క్యాబినెట్ మంత్రిగా తాను ఈ లేఖ రాశానని, తన లేఖపై ముఖ్యమంత్రి స్పందించవచ్చూ స్పందించకపోనూ వచ్చునని ఆయన అన్నారు. జలయజ్ఞంలో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీతో సమీక్ష చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు