సాక్షి టీవీని దులిపేసిన చిరంజీవి

సాక్షి టీవీని దులిపేసిన చిరంజీవి

తనకూ, తన కూతురు సుస్మిత నివాసంలో జరిగిన ఆదాయం పన్ను శాఖ అధికారులకు లింక్ పెడుతూ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన సాక్షి టీవీ చానెల్‌ను కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఉతికి ఆరేశారు. సుస్మిత నివాసంలో ఐటి అధికారులు చేసిన సోదాల్లో 80 కోట్ల రూపాయలు దొరికాయని, అవి చిరంజీవికి చెందివని అనుమానాలు వ్యక్తం చేస్తూ సాక్షి టీవీ శనివారం ప్రసారం చేసిన వార్తాకథనాన్ని ఆయన కొట్టిపారేశారు. ఐటి సోదాలు జరగడం సర్వసాధారణమని, దానికి తనకూ సంబంధం ఉందని ఓ చానెల్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

తనపై చానెల్ అసత్య ప్రచారం సాగిస్తోందని, ప్రజలకు అపోహలు కలిగిస్తోందని, ఆ వార్తాకథనానికి టీవీ చానెల్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తాను చెన్నై వెళ్లానని, ఈ ఉదయమే తాను హైదరాబాదుకు వచ్చానని ఆయన చెప్పారు. వాస్తవాలను దాచి పెట్టి తాను తన కూతురింటికి వెళ్లినట్లు, ఐటి అధికారులు సొమ్ము పట్టుకోవడంతో తాను ఢిల్లీకి వెళ్లినట్లు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని ఆయన అన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. 

తన వియ్యంకుడి వియ్యంకుడు నందగోపాల్‌కు ఎన్నో వ్యాపారాలున్నాయని, ఆయనకు సంబంధించి ఐటి సోదాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తన కూతురి నివాసంలో ఐటి సోదాలు జరిగి ఉంటాయని చిరంజీవి స్పష్టం చేశారు. తన కూతురు నివాసంలో లభించిన సొమ్ము చిరంజీవిదని, దాన్ని ఎన్నికల కోసం దాచి పెట్టానని టీవీ చానెల్ దుష్ప్రచారం చేస్తోందని, ఐటి సోదాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. 

తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన వ్యక్తిత్వ హననానికి ఆ టీవీ చానెల్ దిగిందని, ఐటి దాడుల్లో ఏ మేరకు సొమ్ము దొరికిందో కూడా తనకు తెలియదని, తన కూతురు సుస్మిత కూడా హైదరాబాదులోనే ఉందని ఆయన చెప్పారు. అయినా తాను దాచదలుచుకుంటే దాగేది కాదని, ఐటి అధికారులు మీడియాకు వివరాుల చెప్పారు కదా అని ఆయన అన్నారు. అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతుంటే, దానిపై తాను బయట చెబుతుంటే తనపై దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆయన వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 

బట్ట కాల్సి మీదేసి తీసుకోవాలని అంటారని వైయస్ రాజశేఖర రెడ్డి చెబుతుండేవారని, అదే రీతీలో తనపై టీవీ చానెల్ వ్యవహరించిందని, ఇది ఏ విధమైన నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. కొన్ని జర్నలిస్టు సంఘాలు సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నారని యాగీ చేస్తున్నాయని, సాక్షి సిబ్బందికి ఇబ్బంది కలగకుండా చూడాలని తాను ముఖ్యమంత్రికి సూచించిన కొద్ది గంటల్లోనే తనపై టీవీ చానెల్ దుష్ప్రచారానికి దిగిందని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, వ్యక్తి స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. తనపై జరిగిన దుష్ర్పచారానికి జర్నలిస్టు సంఘాలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. 

పచ్చి అబద్ధాలు ప్రసారం చేస్తున్నారంటే ప్రత్యేకంగా తనపై కక్ష కట్టారని చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తనపై ప్రసారం చేసిన వార్తాకథనాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాయితీయే తనకున్న బలమని, తప్పు చేయకపోవడమే తన బలమని ఆయన అన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన అగత్యం తనకు లేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించాల్సి దౌర్భాగ్యం తనకు లేదని ఆయన అన్నారు.

రాజకీయాలు మాట్లాడుదామంటే తేల్చుకుందామని ఆయన అన్నారు. వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. తనపై ప్రజలకు అభిమానం ఉందని ఆయన చెప్పారు. తప్పు మానవ సహజం, కాదనలేం గానీ దాన్ని సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. తాను తప్పు చేస్తే మీడియా చెండడదా అని ఆయన అడిగారు. తప్పు చేస్తున్నావని ఇంత మంది అంటుంటే, అడ్డగోలుగా డబ్బులు రాలేదని ఏనాడైనా చెప్పాడా అని ఆయన జగన్‌ను ఉద్దేశించి అడిగారు.

తనపై ప్రసారం చేసిన వార్తాకథనానికి సమాధానం చెప్పకపోతే దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. కావాలంటే ఆ పత్రిక వార్తాకథనాన్ని, తన మాటలను వేసుకోవాలని, అప్పుడు ఏమిటో ప్రజలకు అర్థమవుతుందని ఆయన అన్నారు. వాళ్లు చేసిన పనులే వారిని వెంటాడుతున్నాయని, చట్టం తన పని చేసుకుపోతుందని, అయితే దానికి సమయం పట్టవచ్చునని ఆయన అన్నారు.