తెలంగాణ ఎంపీలు సభ బహిష్కరణ

తెలంగాణ ఎంపీలు సభ బహిష్కరణ

తెలంగాణ విషయంలో వెనక్కి తగ్దేది లేదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. కాంగ్రెసు అధిష్టానం నాయకుడు వాయలార్ రవి,  పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం తెలంగాణ పార్లమెంటు సభ్యులతో చర్చించారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మాట్లాడుతామని వారు తమకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సాయంత్రం గులాం నబీ ఆజాద్‌తో సమావేశం జరిగిన తర్వాత తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని వారు చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే వరకు పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామని మధు యాష్కీ గౌడ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై పార్లమెంటు వెలుపల ఎటువంటి ఆందోళనలైనా చేసుకోవాలని, పార్లమెంటుకు హాజరు కావాలని వాయలార్ రవి సూచించారు. అయితే, అందుకు తెలంగాణ పార్లమెంటు సభ్యులు అంగీకరించలేదు. తెలంగాణలో యువకుల ఆత్మహత్యలను ఆపడానికి కూడా కేంద్రం నుంచి ఒక అపీల్ లారేదని మధు యాష్కీ అన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, సహకరించాలని వాయలార్ రవి కోరినట్లు ఆయన చెప్పారు. తాము వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు కూడా చెప్పారని ఆయన అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ వచ్చే వరకు పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల బహిష్కరణ కూడా పోరాటంలో భాగమని ఆయన అన్నారు. తాము పార్లమెంటులో లేనప్పుడు గంట మాత్రమే సమావేశాలను ఇతర పార్టీల సభ్యులు స్తంభింపజేయగలిగారని, ఆ తర్వాత బహిష్కరించారని ఆయన చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సభ్యులు, తెరాస సభ్యులు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, వారిని కలుపుకుని వెళ్లడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తాము రాజకీయ ప్రయోజనం గురించి ఆలోచించడం లేదని వారన్నారు. 

కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని తాము ఎవరికీ చెప్పలేదని మందా జగన్నాథం స్పష్టం చేశారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత తాము ఏం చేస్తామో చెపుతామని సురేష్ షేట్కర్ అన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని, తెలంగాణ ఏర్పడడం అనివార్యమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను అమలు చేయాలని మాత్రమే తాము అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలను, రాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని  వాయలార్ రవి కోరినట్లు ఆయన తెలిపారు. కొన్ని బయటకు చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయని ఆయన అన్నారు.  తెలంగాణకు ఆయుర్వేద చికిత్స పనికి రాదని, శస్త్రచికిత్సనే కావాలని రాజయ్య అన్నారు.