వైయస్ తప్పులతో పార్టీకి సంబంధం లేదు

వైయస్ తప్పులతో పార్టీకి సంబంధం లేదు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరిగితే వాటితో తమ పార్టీకీ ప్రభుత్వానికీ సంబంధం లేదని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ  పొంగులేటి సుధాకర్ రెడ్డి  అన్నారు. మంచి చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీ అవకాశం ఇచ్చిందని, పుత్రుడి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే అది వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత విషయమే అవుతుందని ఆయన అన్నారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి తప్పు చేసినట్లు కోర్టు నిర్ధారిస్తే అప్పుడు అన్ని విషయాలను సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి తప్పు చేసినట్లు ఇంకా కోర్టు నిర్ధారణ చేయలేదని, నిర్ధారణ చేసిన తర్వాత తాము ఎలా వ్యవహరించాలనేది నిర్ణయించుకుంటామని పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో దివంగత నేత  వైయస్ రాజశేఖర రెడ్డి  నేరస్థుడేనని సిబిఐ ఆరోపించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో ఈ విషయాన్ని పేర్కొంది. కుమారుడి మేలు కోసం ఆయన చేసిన దారుణాలకు పాల్పడినట్లు సిబిఐ తేల్చింది. "దివంగత రాజశేఖర రెడ్డి అవినీతి నిరోధక చట్టంలోని 11వ సెక్షన్ కింద నేరానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదో నిందితుడైన వెంకటరామిరెడ్డి (నాటి వుడా వైస్ చైర్మన్)ని ప్రభావితం చేసి... అతి దుర్మార్గమైన రాంకీ లేఔట్ ప్లాన్‌ను ఆమోదించేలా చేశారు. వుడా మాస్టర్ ప్లాన్‌కు భిన్నంగా ఉన్న ఈ ప్లాన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వానికి నష్టం చేశారు. రాంకీ అధిపతి అయోధ్య రామిరెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చారు. దీనివల్లే... జగతి పబ్లికేషన్స్‌లో ఆయన టీడబ్ల్యూసీ, మెసర్స్ ఈఆర్ఈఎస్‌ల ద్వారా రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు'' అని సీబీఐ తన చార్జిషీట్‌లో వివరించింది. దీంతోపాటు అవినీతి నిరోధక చట్టం, 1988లోని 11వ సెక్షన్‌ను పూర్తిగా వివరిస్తూ... దీని ప్రకారం వైఎస్‌కు ఆరునెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉందని తెలిపింది.