అరెస్టు పుకార్లపై డిజిపి నో కామెంట్

అరెస్టు పుకార్లపై డిజిపి నో కామెంట్

ఆస్తుల కేసులో  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు పుకార్లపై స్పందించడానికి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి నిరాకరించారు. వైయస్ జగన్ అరెస్టు ఊహాగానాలపై తాను స్పందించబోనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ అరెస్టు వ్యవహారం సిబిఐ విచారణ పరిధిలో ఉందని ఆయన చెప్పారు. 

మద్దెలచెర్వు సూరి  హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కేసులపై పారదర్శకంగా విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. భాను కిరణ్ కేసుల వ్యవహారాల్లో తాము వాస్తవాలను తొక్కిపెట్టడం లేదని, విచారణ పారదర్శకంగా జరుగుతోందని ఆయన అన్నారు. భాను సంబంధాలపై విచారణ నిష్పాక్షికంగా జరుగుతోందని ఆయన అన్నారు. వర్ధమాన తెలుగు నటి తారా చౌదరి కేసులో తాము కొందరి పేర్లను తొక్కిపెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీకి అడ్డుకట్ట వేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినవారిపైనే కాకుండా తీసుకునేవారిపైనా కేసులు పెడుతామని ఆయన హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులు కారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. 

మద్దెలచెర్వు హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు సంబంధించిన కొన్ని కేసులను సిఐడి దర్యాప్తు చేస్తుండగా, మరికొన్ని కేసులపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాను కిరణ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సైబరాబాద్ పోలీసులు కోర్టు పిటి వారంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తారా చౌదరి కేసులో ప్రముఖుల పేర్లను దాచిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి