వైయస్ విజయమ్మ వద్దకు ఎమ్మెల్యేల క్యూ

 వైయస్ విజయమ్మ వద్దకు ఎమ్మెల్యేల క్యూ

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు  వైయస్ విజయమ్మ వద్దకు పలు పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో విజయమ్మ తన కూతురు షర్మిళతో కలిసి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుండి ఆమె ప్రచారం ప్రారంభించారు. ఆమె ఓ వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే తమ పార్టీలోకి రావాలనుకుంటున్న ఇతర నేతలను కలుస్తూ బిజీబిజీగా ఉన్నారు.

ఇటీవల జగన్ సిబిఐ విచారణకు హాజరైన సమయంలో ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని, బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి కలిశారు. నాని, సుజయలు కాంగ్రెసు ఎమ్మెల్యేలు కాగా బాలనాగి రెడ్డి టిడిపి ఎమ్మెల్యే. ఇందులో సుజయ బుధవారం, ఆళ్ల నాని గురువారం కాంగ్రెసు పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

జగన్ సమస్యల్లో ఉన్నందున పరామర్శించేందుకు వచ్చానన్న బాలనాగి రెడ్డి జగన్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ప్రస్తుతానికి పార్టీ మార్పుపై మౌనంగా ఉన్నారు. కానీ ఆయన చేరిక మాత్రం ఖాయమంటున్నారు. ఉప ఎన్నికలలో ఓటమి చవి చూస్తే కాంగ్రెసు పార్టీ నుండి వరుస వలసలు ఉంటాయని భావించే, వైయస్ జగన్‌ను అరెస్టు చేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా నేతలలో అంతర్మథనం మొదలై అటు వైపు వెళ్లేందుకు జంకుతారని కాంగ్రెసు భావించి ఉంటుందని అంటున్నారు.

అయితే కాంగ్రెసు పార్టీ ఊహించినట్లుగా జగన్ అరెస్టుతో పార్టీ నుండి నేతల వలసలు ఆగలేదు. సరికాదా రోజుకో ఎమ్మెల్యే జగన్ వైపు చూస్తున్నారనే చెప్పవచ్చు. జగన్ సిబిఐ ముందు 25వ తేదిన హాజరయ్యారు. 27న అరెస్టు చేశారు. అప్పటి నుండి ఈ వారం రోజుల్లో దాదాపు ఐదారుగురు ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వారి చర్యల ద్వారా అర్థమవుతోంది. ఆళ్ల నాని, సుజయ ఎలాగూ తాము వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు ప్రకటించారు.

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరం జిల్లా నుండి సుజయ తర్వాత పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి కూడా జగన్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆమె గురువారం పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైయస్ విజయమ్మను కలిశారు. కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా విజయమ్మను కలిశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్వయంగా వచ్చి విజయమ్మ ప్రచారానికి సంఘీభావం తెలిపారు. సుజయ కృష్ణ రంగారావు కూడా ఆమెను కలిశారు.