సిఎం కోవర్టని నేను ఏనాడో చప్పాను

సిఎం కోవర్టని నేను ఏనాడో చప్పాను

 ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి ని ఉద్దేశించి మంత్రి  డిఎల్ రవీంద్రా రెడ్డి  చేసిన వ్యాఖ్యలు తాను సంవత్సరం క్రితమే చెప్పానని మాజీ మంత్రి శంకర రావు గురువారం అన్నారు. ఆయన మధ్యాహ్నం హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేసింది ఇప్పుడు ముఖ్య స్థానంలో ఉన్న వ్యక్తి కాదా అని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆరోపించారు.

ప్రజాపథం ద్వారా ప్రజల సమస్యలు ఏవీ పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు. అధికారులు పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. మెట్రో రైలు పిల్లర్ శంకుస్థాపన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయడంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు  శంకర రావు తెలిపారు.

ముఖ్యమంత్రికి అధికారులపై పట్టు లేదన్నారు. మొదట వారిని అదుపులో పెట్టాలని సూచించారు. పని చేసే వారిని ముఖ్యమైన స్థానంలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వారే వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టులు అని ఆయన అన్నారు. కాగా ఉదయం మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి ముఖ్యమంత్రే జగన్‌కు అసలు కోవర్టు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కాగా ముఖ్యమంత్రి కోవర్టు అనడంపై ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు డిఎల్ రవీంద్ర రెడ్డిపై విరుచుకు పడ్డారు. కిరణ్‌ను కోవర్టు అనడానికి డిఎల్‌కు ఇంగిత జ్ఞానం ఉందా అన్నారు. డిఎల్ ది నాలుకా లేక తాటి మట్టా అని ప్రశ్నించారు. డిఎల్ వ్యాఖ్యలు తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాయని, ఆయనపై త్వరలో క్రమశిక్షణా చర్యలు తీసుకోనుందని చెప్పారు.