సిఎంపై అట్రాసిటి కేసు: శంకరరావు

సిఎంపై అట్రాసిటి కేసు: శంకరరావు

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ మంత్రి శంకర రావు అమీతుమీకి సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయన సిఎల్పీ కార్యాలయం ఎదుట మరోసారి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేగా సిఎల్పీ కార్యాలయంలోకి వెళ్లే హక్కు తనకు ఉందని చెప్పారు. కానీ తనను లోనికి వెళ్లకుండా ముఖ్యమంత్రి అడ్డుకొని తనను అవమానపరిచారన్నారు. తాను ఓ దళితుడిని అని, ఎమ్మెల్యేగా ఉన్న తనకే ఇంత అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్నారు.

కాంగ్రెసులోని అగ్రకులాల వారు దళితులను పార్టీలో ఎదగకుండా అణగదొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. సిఎల్పీలోకి వెళ్లే తన హక్కును కాలరాచినందుకు ముఖ్యమంత్రి పైన, సిఎల్పీ సిబ్బంది పైన తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. తనలాంటి దళితుడిని అడ్డుకున్నందుకు సిఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేను అని, తనకు సిఎల్పీ కార్యాలయానికి వచ్చే హక్కు ఉందన్నారు.

తాను బిజెపికో, తెలుగుదేశం పార్టీకో మరో పార్టీకో చెందిన నేతను కాదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా తాను పోరాడుతున్నానని చెప్పారు. హక్కుల గురించి ఫైట్ చేయమని అంబేడ్కర్ చెప్పారన్నారు. ముఖ్యమంత్రిపై పోలీసులు 24 గంటలలోగా కేసు నమోదు చేయకుంటే తాను మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన చేపడతానని హెచ్చరించారు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు.

దివంగత ప్రధాని ఇందిరమ్మ హయాంలో దళితులకు న్యాయం జరిగిందన్నారు. పార్టీలోని దళిత ద్రోహ నేతలను పారద్రోలి కాంగ్రెసును రక్షించాల్సి ఉందన్నారు. శంకర రావు ప్రెస్ మీట్ ప్రారంభంలో, చివరలో జై సోనియా, జై రాహుల్, జై ఇందిర, జై కాంగ్రెసు అంటూ నినాదాలు చేశారు. ఉప ఎన్నికలలో దళితులను దరి చేర్చుకుంటే అన్ని సీట్లు గెలుచుకుంటామని అన్నారు.

కాగా శంకర రావు తన వ్యక్తిగత సిబ్బందితో ముఖ్యమంత్రిపై, సిఎల్పీ కార్యవర్గంపై అట్రాసిటీ కేసు పెడుతున్న లేఖను సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు పంపించారు. పిఏ ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. ఆ తర్వాత ఆయన స్పీకర్‌ను కలిసి సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశముంది. కిరణ్ కో హఠావో కాంగ్రెసుకో బచావో అన్నారు.

మరోవైపు ఇప్పటికే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఢిల్లీలో మాకం వేశారు. ముఖ్యమంత్రి తీరుపై ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్నారు. ఢిల్లీ పర్యటన తన వ్యక్తిగతమని, వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నానని ఆయన చెప్పినప్పటికీ  కాంగ్రెసు  అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాను అపాయింట్‌మెంట్ కోరానని, అపాయింట్‌మెంట్ ఇస్తే సోనియాను, ఆజాద్‌ను కలుస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వారిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తానని, అలా చెప్పకపోతే తప్పు చేసినవాడిని అవుతానని ఆయన అన్నారు. ఇప్పుడైతే పరిస్థితి బాగానే ఉందని, ఉప ఎన్నికల వల్ల యుద్ధవాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్పారు. తనను పిలిస్తే ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు.