జగన్‌కు శంకర్ అన్న బాసట

జగన్‌కు శంకర్ అన్న బాసట

ఎప్పటికప్పుడు సంచలన ప్రకటన చేస్తున్న మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు శనివారం మరో సంచలన ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగర్ెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బాసటగా నిలిచారు. జగన్ తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంపై వివాదం తగదని ఆయన హితవు పలికారు. హిందూ మతం గంగానది లాంటిదని, వెంకటేశ్వర స్వామిని ఎవరైనా దర్శించుకోవచ్చునని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు .

స్వామివారి దర్శనాన్ని విదవాదం చేయడం హిందూ మతానికి అపరచారం చేయడమే అవుతుందని ఆయన అన్నారు. జగన్ తిరుమల దర్శనం వివాదానికి కాంగ్రెసు నేతలు అంతం చెప్పకపోతే అది బూమ్‌రాంగై కాంగ్రెసునే దెబ్బ తీస్తుందని శంకరరావు అన్నారు. తనకు వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా తిరమలలో వైయస్ జగన్ దైవ దర్శనం చేసుకోవడంపై వివాదం నడుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించినందుకు తనను మంత్రి మండలి నుంచి తొలగించారని, అగ్రకులానికి చెందిన ఓ మంత్రి ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎందుకు తొలగించలేదనే భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వ్యవహారంపై విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డిని  మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే. తాను చేసినట్లుగానే డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శిస్తే ఎందుకు మంత్రివర్గం నుంచి తొలగించలేదనేది  శంకరరావు  అభిప్రాయం. అలాగే, భాను కిరణ్‌తో హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక్ ‌రెడ్డికి సంబంధాలున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.