సిఎంపై శంకరరావు రుసరుస

సిఎంపై శంకరరావు రుసరుస

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై  మాజీ మంత్రి శంకర రావు మరోసారి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిని ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డితో పోల్చలేమని ఆయన మంగళవారం అన్నారు. కిరణ్ తన తీరు మార్చుకోకపోతే అతనే మారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సహకార రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని కితాబు ఇచ్చారు. సహకార కార్యక్రమాలలో దేనికైనా కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

చచ్చినా తన శైలిని మార్చుకోననే తరహా కిరణ్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సిఎం అహంభావంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనలో అడుగడుగునా కుల అహంభావం కనిపిస్తోందన్నారు. పార్టీ భూస్థాపితం అయినా మారిపోననే విధంగా కిరణ్ వైఖరి ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి జైలులో ఉన్నప్పుడు తన తండ్రి విడిపించారని కిరణ్ చెప్పడం సరికాదన్నారు.

నేరస్తుడిని జైలు నుండి విడిపించారన్నందుకు  కిరణ్వ్యాఖ్యలపై ఎవరైనా పిల్ వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ఐక్యతతో పార్టీని నడిపిస్తే ఉప ఎన్నికలలో పద్దెనిమిది సీట్లు కాంగ్రెసు పార్టీవే అన్నారు.

తనను పార్టీ పెద్దలు ప్రచారానికి పిలవడం లేదని ఆయన మండిపడ్డారు. తన వల్ల మరో నాలుగు ఓట్లు రావడం ఎవరికీ ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి రిఫరెండమే అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు నేతలు జోరుమీద ఉన్నారన్నారు. తన స్టైల్ మారదని ఇంతే అన్నారు.