వైయస్‌పై వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి ఫైర్

వైయస్‌పై వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి ఫైర్

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ విషయంలో తెలుగుదేశం  రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి  జీవన్ రెడ్డి  తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి అన్యాయం చేశారని దేవేందర్ గౌడ్ చేసిన విమర్శలో నిజం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

తెలంగాణలోని ప్రాజెక్టులను చేపట్టిన నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కరు మాత్రమేనని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు వైయస్ రాజశేఖర రెడ్డి ఘనతేనని ఆయన అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి విస్మరించారని, వైయస్ రాజశేఖర రెడ్డి దాన్ని పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఎల్లంపల్లి, ఎస్ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టులన్నీ వైయస్సార్ పుణ్యమేనని ఆయన అన్నారు. 

తెలంగాణకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టుకున్న దేవేందర్ గౌడ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిని చేసేసరికి చంద్రబాబును ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తెలంగాణ ప్రజలపై బషీర్‌బాగ్‌లో కాల్పులకు ఆదేశించింది దేవేందర్ గౌడేనని ఆయన అన్నారు. తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు దేవేందర్ గౌడ్‌కు లేదని ఆయన అన్నారు. 

కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని చంద్రబాబు నాయుడు కలిసింది తెలంగాణను అడ్డుకోవడానికేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ సంగతి ఏం చేశారో దేవేందర్ గౌడ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చిదంబరాన్ని కలుసుకోలేదని ఆ పార్టీ నేతలు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అదే నిజమైతే సభను తప్పు దోవ పట్టించినందుకు చిదంబంరపై తెలుగుదేశం పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వానలి ఆయన డిమాండ్ చేశారు.