భాను పత్రిక పెడితే సమర్థిస్తారా?

భాను పత్రిక పెడితే సమర్థిస్తారా?

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ పత్రిక పెడితే పత్రికా స్వేచ్ఛ పేరుతో సమర్థిస్తారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన మీడియా సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా, పత్రికా స్వేచ్ఛకు భంగకరంగా అభివర్ణించడంపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ విషయంలో పత్రికా రచయితలు కూడా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. జగన్ సాక్షిలోకి వచ్చిందంతా అవినీతి సొమ్మేనని ఆయన వ్యాఖ్యానించారు. 

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కలైంగర్ టీవి చానెల్ ఖాతాలను కూడా స్తంభింపజేశారని ఆయన గుర్తు చేశారు. సిబిఐ దర్యాప్తులో భాగంగానే సాక్షి మీడియా సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారని ఆయన చెప్పారు. తనకు పత్రిక పెట్టుకోవడం చాత కాదా అని ఒక సందర్బంగా ఆగ్రహంగా అన్నారు. పత్రికా రచయితలు మేధావులని, వారిపై తనకు గౌరవం ఉందని, అవినీతిపై పత్రికా రచయితలు కూడా పోరాడాలని, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు పోరాటం చేశారని ఆయన అన్నారు. పత్రిక పెట్టి బెదిరిస్తారా, అలా బెదిరిస్తే తాము బెదిరిపోతామా అని ఆయన అడిగారు. 

తాము అవినీతిపై పోరాటం చేస్తున్నామని, మొదటి నుంచీ తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. తాము అవినీతిపై పోరాడుతుంటే ఎదురు దాడికి దిగుతున్నారని, తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఖనిజ సంబదనంతా వైయస్ కుటుంబం కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు. వైయస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. ఓబుళాపురం, బయ్యారం, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో ఖనిజ సంపదను కొల్లగొట్టి ప్రైవేట్ ఆస్తులపై కూడా పడ్డారని, రైతుల భూమూలను లాక్కున్నారని ఆయన అన్నారు.

వైయస్ జగన్ అవినీతిపై తాము పోరాటం చేస్తున్నామని, అలా పోరాటం చేస్తుంటే జగన్ మీడియాలపై తమపై ఎదురు దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. ఆదర్శ్, 2జి, కామన్‌వెల్త్ కుంభకోణాలపై తాము పోరాటం చేశామని, అలాగే వైయస్ జగన్ అవినీతిపై కూడా పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. జగన్ అవినీతిపై కాంగ్రెసు కూడా ముందుకు రాలేదని, కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడినవారికి శిక్ష పడుతుందని, బిజెపి నాయకుడు బంగారు లక్ష్మణ్‌కు శిక్షపడిందని, ఎమ్మార్, గాలి జనార్దన్ రెడ్డి, జగన్ కేసుల్లో పది మంది దాకా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

తనకు పత్రికా స్వేచ్ఛపై నమ్మకం ఉందని ఆయన చెప్పారు.  భాను కిరణ్  పులివెందుల కృష్ణ తనకు బాస్ అంటున్నాడని, పులివెందుల కృష్ణ వైయస్ జగన్ అనుచరుడని ఆయన అన్నారు. పరిటాల హత్య కేసులో నిందితులు ఐదుగురు చనిపోయారని, ఎందుకు చనిపోయారో తెలియడం లేదని ఆయన అన్నారు. అవినీతి కార్యక్రమాలపై చర్యలకు, పత్రికా స్వేచ్ఛకు సంబంధం లేదని ఆయన అన్నారు. తప్పుడు పనులు చేసి అతలాకుతలం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్మును జప్తు చేస్తామని తాము ఎన్నికల ప్రణాళికలో కూడా చెప్పామని ఆయన అన్నారు.

కష్టపడి సంపాదించిన సొమ్ముతో పత్రిక పెట్టుకుంటే ఫరవాలేదని, అవినీతి సొమ్ముతో పెట్టారని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటున్నారని ఆయన అన్నారు. చట్టం కొంత మందికి చుట్టంగా మారుతోందని ఆయన అన్నారు. అవినీతికి సంబంధించి వైయస్ రాజశేఖర రెడ్డికి తాము చెప్పామని, వైయస్ వినలేదని, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తాము కూడా లాలూచీ పడాలా అని ఆయన ఒక సందర్భంలో ప్రశ్నించారు. తనపై 25 విచారణలు జరిపించారని, కోర్టు కేసులు వేశారని ఆయన అన్నారు.