ప్రధానిగా నరేంద్ర మోడీకే మెజారిటీ ఓటు?

ప్రధానిగా నరేంద్ర మోడీకే మెజారిటీ ఓటు?

భారత భావి ప్రధానిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. రెండు ప్రముఖ సంస్థలు నిర్వహించిన ఓపినియన్ పోల్‌లో నరేంద్ర మోడీకి భావి ప్రధానిగా ఎక్కువ ఓట్లు పడగా, దాన్ని ట్విట్టర్ పోస్టులు ధ్రువీకరిస్తున్నాయి. భారత ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోడీ తగినవారని ఎబిపి - నీల్సన్ సర్వేలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీ కన్నా నరేంద్ర మోడీయే ఎక్కువ మంది అభిమానాన్ని చూరగొన్నట్లు తేలింది. 

నరేంద్ర మోడీ జాబితాలో 17 శాతంతో రాహుల్ కన్నా నాలుగు పాయింట్లు ఎక్కువ సాధించారు. జాబితాలో ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మోడీ కన్నా ప్రజాభిప్రాయంలో వెనకపడ్డారు. సోనియా గాంధీ నరేంద్ర మోడీ కన్నా చాలా వెనకబడ్డారు. ఆమెను 9 శాతం మంది మాత్రమే భావి ప్రధానిగా చూస్తున్నారు. మూడేళ్ల కాలంలో యుపిఎ 2 ప్రభుత్వం ప్రజాదరణను కోల్పోయినట్లు, ప్రజలు మార్పును కోరుతున్నట్లు కూడా సర్వేలో తేలింది. ఈ స్థితిలో నరేంద్ర మోడీని ప్రజలు ప్రధానిగా కోరుకుంటున్నారు. 

సిఎన్ఎన్ - ఐబిఎన్ సర్వేకు వస్తే - అదే ఫలితం కనిపిస్తోంది. యుపిఎ ప్రభుత్వం దేశాన్ని పాలించే విషయంలో క్రెడిబిలిటీని కోల్పోయిందని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయం ఎవరంటే నరేంద్ర మోడీ అనే సమాధానం వచ్చింది. భారత ప్రధానిగా 39 శాతం మంది నరేంద్ర మోడీని కోరుకుంటున్నట్లు తేలింది. జాబితాలో రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌ల కన్నా ముందున్నారు. 

ఈ రెండు సర్వేల నేపథ్యంలో ప్రధాన స్రవంతి మీడియా దాన్ని ధ్రువీకరించకోవడానికి ప్రయత్నాలు చేసింది. దీంతో పిఎంగా మోడీ, ఎందుకు ప్రశ్న ముందుకు వచ్చింది. సమాధానాలు వరదలా వచ్చి పడడం ప్రారంభమైంది. మోడీ సమర్థత, భారతదేశాన్ని ముందుకు నడిపించే చలనశీల శక్తి అందుకు కారణమని ట్వీటర్లు నిక్కచ్చిగా చెప్పారు. కొంత మంది ట్వీటర్లు గుజరాత్ అభివృద్ధిని ఉదాహరణగా చూపారు. విద్యుత్ కోత లేకపోవడం, ఇ - గవర్నెన్స్‌లో ముందంజ, సౌరశక్తిలో ప్రగతి, నీటి ఆదా వంటి కారణాలను వారు చూపారు. 

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా మోడీని భావి ప్రధానిగా చూడడానికి కారణమని తేలింది. కొంత మంది చరిత్రలోకి వెళ్లాైరు. గాంధీజీ ఆశించిన రామరాజ్యం మోడీ వల్ల సాధ్యమవుతుందని చెప్పారు. సర్దార్ పటేల్ ప్రధాని ఏమయ్యేదో అది మోడీ చేసి చూపుతారని ఓ ట్వీటర్ అంటూ మోడీలో స్వామి వివేకానందను చూశారు. కొంత మంది హాస్యస్పోరకంగా నాన్ సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. మోడీ పిఎం అయితే తన వంటి కార్యకర్తలు రేస్ కోర్స్ రోడ్డు బయట డ్యాన్స్ చేయడానికి అవకాశం లభిస్తుందని ఓ ట్వీటర్ వ్యాఖ్యానించాడు. తాను పిఎం నివాసంలో హోలీ సంబరాలు చేసుకోవడానికి చూస్తున్నానని మరొకతను అన్నాడు. మోడీ ప్రధాని అయితే సైన్యం గౌరవం పెరుగుతుందని, మీడియాపై ఆంక్షలు తగ్గుతాయని ఒకతను అన్నాడు. 

ట్విట్టర్ వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విదేశాల్లోని భారతీయులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విధమైన సర్వేల్లో మోడీ అగ్రస్థానంలో నిలబడడం ఇదే మొదటిసారి కాదు. ఇండియా టుడే ఫిబ్రవరిలో మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్‌లో కూడా మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలను అధిగమించి మోడీ అగ్రస్థానంలో నిలిచారు. నిరుడు సెప్టెంబర్‌లో అమెరికా ఆలోచనాపరులు మోడీని కింగ్ ఆఫ్ గవర్నెన్స్‌గా అభివర్ణించారు. వికీలీక్స్ సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా మోడీని భావి ప్రధానిగా ఆశిస్తున్నట్లు తేలింది. 

దేశం యుపిఎకు అవకాశం ఇచ్చి చూశారు. ఇప్పుడు మోడీ వైపు దేశం చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఏ విధమైన ప్రభుత్వాన్నైనా, ఏ పార్టీతోనైనా మోడీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించగలరనేది సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల నాయకులు బాదల్, శివసేన నేతలు, రాందాస్ అథవాలే వంటివారితో ఆయన మంచి సంబంధాలున్నాయి. మోడీ పట్ల రాజ్ థాకరే, జయలలిత, నవీన్ పట్నాయక్ వంటి వారు కూడా సానుకూలంగా ఉన్నట్లు ఇటీవలి రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయ వర్గాలు జీర్ణం చేసుకోవాల్సి ఉంటుంది. అసమర్థ, అవినీతి పాలన నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఇప్పుడు మోడీ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.