జగన్ పార్టీలోకి చిరంజీవి అల్లుడు?

జగన్ పార్టీలోకి చిరంజీవి అల్లుడు?

 కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి రెండో అల్లుడు శిరీష్ భరద్వాజ్ చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో శిరీష్ భరద్వాజ్ ఆదివారం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతోనే శిరీష్ వైవి సుబ్బారెడ్డితో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి రెండో కూతురు శ్రీ.. శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు. శిరీష్ పైన వరకట్న వేధింపుల కేసు పెట్టారు. అతను బెయిల్ తెచ్చుకొని సైలెంటయిపోగా, శ్రీజ తండ్రి వద్దనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గాని, కాంగ్రెసు పార్టీలో గాని చేరాలనే అభిప్రాయంతో శిరీష్ భరద్వాజ్ ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. టిడిపికంటే ఆయన జగన్ పార్టీ వేపే మొగ్గు చూపుతున్నారనే వాదనలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో శిరీష్ జగన్ పార్టీ వైపుకు వెళ్లేందుకే ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు. కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జోరుగా వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి పలువురు నేతలు జగన్ పార్టీలోకి చేరుతున్నారు.

చిరంజీవికి చెక్ పెట్టేందుకు శిరీష్ భరద్వాజ్‌ను కూడా తమ పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరుతో శిరీష్ కు విభేదాల నేపథ్యంలో ఆయనను తీసుకుంటే రాజకీయంగా మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారట. శిరీష్ పబ్లిక్ ఫిగర్ కాకపోయినప్పటికీ విభేదాల నేపథ్యంలో సానుభూతిపరంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారని అంటున్నారు.