వైయస్ జగన్ తర్వాత ఎవరు!?

వైయస్ జగన్ తర్వాత ఎవరు!?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  తర్వాత నెంబర్-2 ఎవరు అనే ఆసక్తికర చర్చ రాజకీయవర్గాల్లో, ఆ పార్టీలోనూ జరుగుతోందని అంటున్నారు. సాధారణంగా నెంబర్-2 అని కాకుండా జగన్ తర్వాత స్థానం మాత్రం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మదే. అయితే వాక్చాతుర్యం, వ్యూహరచనల పరంగా చూస్తే ఆమె పరిధి పార్టీలో దాదాపు శూన్యమనే చెప్పవచ్చు.

దీంతో జగన్ తర్వాత ఆ పార్టీలో నెంబర్-2 ఎవరనే చర్చ ప్రధానంగా జరుగుతోందని అంటున్నారు. ఆస్తుల కేసును ఎదుర్కొంటున్న జగన్‌‍ను సిబిఐ ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చుననే ప్రచారం గతకొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయమ్మను ప్రముఖంగా చూపించే అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యూహాలు రచిస్తూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లగలిగే నేత వైయస్సార్ కాంగ్రెసుకు కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పార్టీ జగన్ చరిష్మా పైనే ఆధారపడింది.

జగన్ కనుక అరెస్టు అయితే సానుభూతితో పాటు జగన్ చరిష్మా కూడా పార్టీకి పనికి వస్తుంది. కానీ ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లేందుకు సరైన వ్యూహకారుడు, నడిపించే వాడు కావాలి. అలాంటి వ్యక్తి వైయస్సార్ కాంగ్రెసులో ఎవరూ లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే జగనే పార్టీలో నెంబర్-2గా ఎవరూ ఎదగకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు ధీటుగా ఎవరైనా ఎదిగితే, ఆ తర్వాత తన నుండి వారు విడిపోతే పార్టీ దెబ్బ తింటుందనే భయంతోనే జగన్ ఎవరిని తన తర్వాత స్థాయికి ఎదగకుండా చేస్తున్నారని అంటున్నారు.

అయితే అది మొదటికే మోసం తెచ్చే అవకాశముందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎర్రన్నాయుడు, ఎర్రబెల్లి దయాకర రావు, దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు తదితరులను నెంబర్ టూగా పిలుస్తారు. జాతీయ పార్టీ కాంగ్రెసులో కూడా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు జానా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు తదితర నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

కానీ జగన్ పార్టీలో మాత్రం ఇప్పటి వరకు ఎవరూ నెంబర్ టూగా కనిపించలేదు. కొంతకాలం క్రితం వరకు అంబటి రాంబాబు మీడియాలో ప్రముఖంగా కనిపించే వారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన ప్రభావం కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. సినీ గ్లామర్ టచ్ ఉన్న రోజా కూడా జగన్ ప్రతి కార్యక్రమంలో దాదాపుగా కనిపించే వారు. కానీ గతకొద్దికాలంగా ఆమె కేవలం టివి ఛానళ్ల షోలలో బిజీగా ఉంటున్నారు. ఆమెకు ప్రజలతో మమేకం అయ్యే అవకాశమే రావడం లేదంటున్నారు.

కొద్ది రోజులుగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గట్టు రామచంద్ర రావు, గోనె ప్రకాశ రావు, వాసిరెడ్డి పద్మలు మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు కూడా వెనక్కి వెళ్లి కొత్తవారు వచ్చే ఆస్కారం లేకపోలేదని అంటున్నారు. జగన్ ఉద్దేశ్య పూర్వకంగానే ఒకరికి ఒక స్థాయిలో పేరు వచ్చిన తర్వాత వారిని మార్చి, ఆ స్థానంలో మరొకరిని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఇందుకు రాజశేఖర్ - జీవితలే మంచి నిదర్శనమని అంటున్నారు.

వారు బహిరంగంగానే జగన్ వైఖరిని తప్పు పట్టారు. బహిరంగ సభలలో ప్రజల నుండి తమకు వస్తున్న మద్దతు జగన్‌కు కంటగింపుగా మారిందని వారు చెప్పారు. ఆ తర్వాత వారు జగన్‌కు పూర్తిగా దూరమయ్యారు. వరంగల్ జిల్లాలో ఓసారి కొండా సురేఖను, మరోసారి పుల్లా పద్మావతిని జగన్ ప్రోత్సహించారనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కొంతకాలం సురేఖ అసంతృప్తిగా ఉన్నారు, తాజాగా పుల్లా పద్మావతి కాంగ్రెసు గూటికి చేరారని చెబుతున్నారు.

పార్టీలో ఉన్న పలువురు నేతలలో కూడా జగన్ వైఖరి పట్ల అసంతృప్తి ఉందని, కానీ అది బయటకు రావడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ స్వతహాగా ఎవరినీ విశ్వసించడని, రాజకీయాలలో అయితే మరీ అని, అందుకే ముందు జాగ్రత్తతో పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అతను తన దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ పార్టీ సమావేశాలలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమయాజులు, సజ్జల రామకృష్ణా రెడ్డి, సిసి రెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. వీరెవరికీ ప్రజా జీవితంతో గాని, ప్రజలతో గాని ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. ప్రజలతో సంబంధాలు ఉన్న నేతలతో కీలక నిర్ణయాలు జగన్ తీసుకోడనే వాదనలు వినిపిస్తున్నాయి.