కోదండరామ్‌కు కెసిఆర్ ఝలక్

కోదండరామ్‌కు కెసిఆర్ ఝలక్

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఝలక్ ఇచ్చారు. శనివారం జరిగన జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానికి తెరాస డుమ్మా కొట్టింది. తెరాస వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి నాయకులు సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు. వరంగల్ జిల్లా పరకాల సీట్లో ఉమ్మడి అభ్యర్థిని పోటీ దించే విషయంపై తెలంగాణ జెఎసి శనివారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెరాస నాయకులు కూడా వస్తున్నారని చెప్పడంతో బిజెపి నాయకులు వచ్చారు. తీరా, తెరాస నాయకులు డుమ్మా కొట్టడంతో ఆగ్రహంతో బిజెపి నాయకులు వెళ్లిపోయారు. 

బిజెపి వాకౌట్ చేయలేదని, సమావేశం ముగిసిన తర్వాత బిజెపి నాయకులు వెళ్లిపోయారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సమావేశానంతరం చెప్పారు. రెండు పార్టీలతో మాట్లాడుతామని ఆయన చెప్పారు. ఇరు పార్టీల మధ్య పోటీ నివారించే ప్రయత్నం చేస్తామని, పోటీ అనివార్యమైతే ఏం చేయాలనే విషయంపై తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు. వరంగల్ జెఎసి బిజెపికి మద్దతు ఇస్తుందనే వాదనను ఆయన ఖండించారు. తాము ఐక్యంగానే నిర్ణయాలు తీసుకుంటామని, ఐక్యంగానే ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. 

పరకాలలో ఉమ్మడి అభ్యర్థికి బిజెపి, తెరాసలు నిరాకరిస్తున్నాయి. తమకంటే తమకే మద్దతు ఇవ్వాలని బిజెపి, తెరాస జెఎసిని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి తెరాస పార్టీ ప్రతినిధులు హాజరు కాలేదు. కోదండరామ్ సమావేశానంతరం తెరాస, బీజేపీ నేతలతో వేర్వేరుగా మాట్లాడుతానని వెల్లడించారు. పార్టీ సమావేశం ఉన్నందను తాము జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానికి రాలేమని చెప్పారని, ముందు అనుమతి తీసుకునే సమావేశానికి రాలేదని కోదండరామ్ చెప్పారు. 

పరకాల ఉప ఎన్నికలో తెరాసకు తెలంగాణ జెఎసి మద్దతు ఇచ్చి తీరాలని తెరాస నేత విజయశాంతి ప్రభృతులు డిమాండ్ చేస్తున్నారు. జేఏసీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజలు నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దని విజయశాంతి ఒకింత హెచ్చరిక కూడిన స్వరంతో తమ వైఖరిని స్పష్టం చేశారు. 

గడచిన ఉప ఎన్నికలో పాలమూరులో బీజేపీ గెలవడం యాదృచ్ఛికమని ఆమె అన్నారు. పాలమూరు వేరు, పరకాల వేరని బీజేపీ నేతలు గుర్తించాలని హితవు పలికారు. బీజేపీ నేతలు అతివిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారని అభిప్రాయపడ్డారు. విజయశాంతి డిమాండ్‌ను కోదండరామ్ సమర్థించారు. మద్దతు ఇవ్వాలని అడగడంలో తప్పేమీ లేదని, వారికి ఆ హక్కు ఉంటుందని ఆయన అన్నారు. బిజెపి, తెరాస మధ్య ఏకాభిప్రాయానికి తాము కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.