బిజెపి, తెరాస పోరు: కొండా సురేఖకు లాభం

బిజెపి, తెరాస పోరు: కొండా సురేఖకు లాభం

 వరంగల్ జిల్లాలోని పరకాల శాసనసభ స్థానంలో తెలంగాణ పార్టీల విజయం నల్లేరు మీద బండి నడక కాదనేది స్పష్టం. బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమ తమ అభ్యర్థులను రంగంలోకి దించుతుండడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ గట్టెక్కే అవకాశాలున్నట్లు అంచనాలు సాగుతున్నాయి. ఆ రెండు పార్టీలకు సురేఖ షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గంలో సురేఖదే పైచేయిగా ఉంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితిలో మార్పు రావచ్చునని కూడా అంటున్నారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తెలంగాణ కోసం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆమె చెబుతున్నారు. పైగా, తెలంగాణ ఫలానా తేదీన వస్తుందని చెప్తే తాను పోటీకి దూరంగా ఉంటానని ఆమె తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు మంగళవారం సవాల్ విసిరారు. తెరాసను ఆమె దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు కూడా అర్థమవుతోంది. 

కొండా సురేఖ దంపతులకు వీరవిధేయులతో పాటు అదే స్థాయిలో శత్రువులున్నారు. సురేఖ, ఆమె భర్త మురళి తన విధేయుల కుటుంబాలకు చెందిన పెళ్లిళ్లకు, తదితర కార్యక్రమాలకు విధిగా హాజరవుతారు. ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. ప్రత్యర్థులపై అంతే కఠినంగా ఉంటారు. సురేఖ మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు గత శాయంపేట నియోజకవర్గం నుంచి, ఒక్కసారి ప్రసుత పరకాల నుంచి ఆమె గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చీల్చడం వల్ల తెరాస అభ్యర్థిపై 1200 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

తెలంగాణ ఓట్లు బిజెపి, తెరాస మధ్య చీలుతాయని, ఈ రెండు పార్టీలకు కలిపి 40 శాతం ఓట్లు ఉన్నాయని ఓ సర్వే తెలుపుతోంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలితే సురేఖ కచ్చితంగా గెలుస్తుందని అంటున్నారు. సురేఖకు 30 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 50 శాతం బిసి ఓటర్లున్నారు. ఇది కూడా సురేఖకు లాభిస్తుందని అంటున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ బిసి అయిన సమ్మారావును రంగంలోకి దింపింది.  బిజెపి, తెరాస అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. పరకాలలో ఓడిపోతే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చిక్కుల్లో పడక తప్పదని అంటున్నారు.