జగన్‌కు రేపు బెయిల్ ఖాయం..

జగన్‌కు రేపు బెయిల్ ఖాయం..

రాష్ట్రంలో గురువారం రెండు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి రెండు కోర్టులు బెయిల్‌ను మంజూరు చేశాయి. వీటిలో ఒకటి సెక్స్ రాకెట్‌కు కీలక సూత్రధారిగా ఉన్న తారా చౌదరి కాగా, మరొకరు హత్య కేసులో అరెస్టు అయిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ఉన్నారు. 

గత మార్చి 31వ తేదీన అరెస్టు అయిన తారా చౌదరికి నాంపల్లి కోర్టు మే 31వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అలాగే, సోదరుని హత్య కేసులో అరెస్టు అయిన కేఏపాల్‌కు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 

హైకోర్టు దారిలోనే శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంటే జగన్ మోహన్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉపఎన్నికలు జరుగనున్న ప్రాంతాల్లో జగన్ సుడిగాలి పర్యటనలు చేసేందుకు వీలుగా హెలికాప్టర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఒకవేళ అనుకున్నట్లుగానే జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరయితే ఈసారి ప్రచారం మరింత వేడి పుట్టించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి ప్రచార బరిలోకి తిరిగి వస్తే ఈ సంఖ్య 10కి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదే లెక్క కనుక కుదిరితే ఇక రాష్ట్రంలో కిరణ్ సర్కార్‌కు నూకలు చెల్లినట్లే. ఇప్పటికే బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తున్న కిరణ్ సర్కార్‌కు ఎన్నికల అనంతరం బొప్పి కట్టడం ఖాయమంటున్నారు. మరోవైపు ఎన్నికలు ముగిశాక తెలంగాణ లొల్లి కూడా ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ భవితవ్యం అటో ఇటో తేలిపోవడం ఖాయమని అంటున్నారు.