జగన్ వద్దంటే వినలేదు: రఘువీరా

జగన్ వద్దంటే వినలేదు: రఘువీరా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ వదిలి వెళ్లవద్దని అప్పట్లో ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ వినలేదని మంత్రి రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన అనంతపురంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రస్తుతం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వైయస్ జగన్ వ్యవహార శైలి వల్లే ఇప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఆయన కారణంగా ప్రజలపై భారం పడుతోందన్నారు. పార్టీని వీడవద్దని చెప్పినప్పటికీ ఆయన వినలేదన్నారు. పలువురు వ్యాపారాల కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు, వ్యాపారాలకు సంబంధం పెట్టవద్దన్నారు. రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు.

కర్నూలు జిల్లాలో భూమన నాగి రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి కర్నూలులో అన్నారు. భూమా నాగి రెడ్డి వ్యవహార శైలి ఇలాగే ఉంటే పాత రోజులు పునరావృతం అవుతాయని అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు గెలుపు ఖాయమని చెప్పారు.

కాగా అంతకుముందు హైదరాబాదులో.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తాను ప్రజలకు చేసిందేమిటో, చేయబోయేదేమిటో చెప్పే పరిస్థితిలో లేదని మంత్రి శైలజానాథ్ ఆదివారం అన్నారు. ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకట రమణ రెడ్డితో కలిసి శైలజానాథ్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ కోసం కొండలను తవ్వడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించనని శైలజానాథ్ చెప్పారు.

బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని వినియోగంలోకి రాని సెజ్ భూములను వెనక్కి తీసుకోవాలన్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్లు కాస్త సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ తన ప్రచారంలో కాంగ్రెసు పార్టీ విధానాలనే ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పథకాల లేబుళ్లనే ఆయన తగిలించుకుంటున్నారన్నారు. ప్రాజెక్టులు కట్టడం ప్రభుత్వం విధి అని చెప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని వెంకట రమణ రెడ్డి అన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న పనులు చూసి వైయస్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఒప్పందం చారిత్రాత్మకం అన్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టమవుతోందని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టును కూడా ప్రభుత్వం పూర్తి చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో అవినీతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే ప్రిన్సిపల్ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాఫ్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసు పథకాలే అన్నారు. అవి ఏ ఒక్క వ్యక్తికి చెందినవి కాదన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది చెప్పారు.