వెనక్కి తగ్గిన జూ.ఎన్టీఆర్?

 వెనక్కి తగ్గిన జూ.ఎన్టీఆర్?

అభిమానుల ఆగ్రహం వల్లనే జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గారనే మాట వినిపిస్తోంది. వ్యూహాత్మకంగానే ఆయన వెనక్కి తగ్గి తెలుగుదేశం పార్టీ పట్ల తన విధేయతను ప్రదర్శించారని అంటున్నారు. అయినా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారే తప్ప, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన విధేయత ప్రకటించలేదు. తనకు సన్నిహితుడైన వల్లభనేని వంశీ విజయవాడ నడిరోడ్డు మీద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలవడం అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు. 

వల్లభనేని వంశీ వ్యవహారంపై కొద్ది వారాల పాటు మౌనం వహించిన జూనియర్ ఎన్టీఆర్ అకస్మాత్తుగా శనివారం నోరు విప్పారు. తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని బలపరచడం బాధ్యతగా చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ముఖ్యంగా - గుంటూరు, కృష్ణా జిల్లాలోని అభిమానులు తమ హీరోపై కాస్తా ఘాటుగానే ప్రతిస్పందించారని అంటున్నారు. 

ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శిస్తున్న దమ్ము ఫ్లెక్సీలను, బ్యానర్లను అభిమానులు తొలగించడం ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. వల్లభనేని వంశీ జగన్‌ను కలవడంపై జూనియర్ ఎన్టీఆర్ ప్రతిస్పందన కోసం అభిమానులు నిరీక్షించారని అంటున్నారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ వంశీ వెనక ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇంత జరిగినా తమ హీరో మాట్లాడకపోవడంపై అభిమానులు అసంతృప్తికి గురైనట్లు చెబుతారు. 

వంశీ వ్యవహారంపై హీరో బాలకృష్ణ తీవ్ర అగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ను మరిచిపోవాలని పరోక్షంగా సూచించారు. బాలయ్య మాటలతో అభిమానులు దమ్ము సినిమా ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించడం ప్రారంభించారని అంటున్నారు. దమ్ము చూడవద్దంటూ ఎస్ఎంఎస్‌లు కూడా పంపిణీ కావడం ప్రారంభమైంది. హిట్ టాక్ వచ్చి ఆడుతున్న సమయంలో దమ్ము సినిమాపై కాస్తా వ్యతిరేక పవనాలు వీయడం ప్రారంభమైందని అంటారు. దీంతో వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

వంశీతో తనకు సంబంధాలు లేవని చెప్పడమే కాకుండా, ఆయన కేవలం తన అదుర్స్ సినిమాకు నిర్మాత మాత్రమేనని చెప్పారు. కోస్తా డిస్ట్రిబ్యూటర్స్ దమ్ము సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కావడం విశేషం.