నా అరెస్టు వెనక వైయస్ జగన్: కెఎ పాల్

తన తమ్ముడు డేవిడ్ రాజు హత్య కేసులో తనను పోలీసులు అరెస్టు చేయడం వెనక కుట్ర ఉందని క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్ ఆరోపించారు. ఆయనను సోమవారం తెల్లవారు జామున ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. వారి సంగతి దేవుడే చూసుకుంటాడని ఆయన అన్నారు.
ప్రజాశాంతి పార్టీ పెట్టినందుకు భయపడి తనపై కుట్ర చేశారని ఆయన విమర్శించారు. గతంలో తనపై కక్ష కట్టినవారి సంగతి దేవుడు చూశాడని, ఇప్పుడు కూడా దేవుడు వారి సంగతి చూస్తాడని ఆయన అన్నారు. డేవిడ్ రాజు హత్యకు కెఎ పాల్ సూపారీ ఇచ్చాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారని అంటున్నారు.
సోమవారం తెల్లవారు జామున ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు రిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఇంటి వద్ద ఒంగోలు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. ఆయనకు జిల్లా న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. కెఎ పాల్ది విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం సారిపల్లి గ్రామం. డేవిడ్ రాజుకు, పాల్‌కు మధ్య భోగాపురంలోని గీంసిటీకి సంబంధించిన వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.
డేవిడ్ రాజ్ రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు గుర్తించి, పోలీసులు కొంత మందిని అరెస్టు కూడా చేశారు. డేవిడ్ రాజుకు, కెఎ పాల్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఈ ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును
కెఎ పాల్
హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.