వంశీకి షోకాజ్ నోటీసునపై ఆగ్రహం

వంశీకి షోకాజ్ నోటీసునపై ఆగ్రహం

 తనకు సన్నిహితుడైన తెలుగుదేశం పార్టీ విజయవాడ నాయకుడు  వల్లభనేని వంశీ కి షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సినిమా దమ్ము విడుదల రోజున బందర్ పోర్టు సాధన కోసమంటూ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా బంద్ నిర్వహించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వంశీకి షోకాజ్ నోటీసు జారీ, దమ్ము సినిమా విడుదల రోజు కృష్ణా జిల్లా బంద్ తనకు వ్యతిరేకంగా కావాలని చేసిందనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. 

ఆ రెండు విషయాలపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే తన ప్రణాళికను అమలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా, గుడివాడ శాసనసభ్యుడు  కొడాలి నాని  మంత్రి పార్ధసారథిని కలిశారు. పార్టీ ప్రతిస్పందనను తెలుసుకోవడానికే నాని మంత్రిని కలిసినట్లు చెబుతున్నారు. నానిపై చర్యలు తీసుకోవడానికి పూనుకుంటే ఇటీవల బాలకృష్ణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన విషయాన్ని చర్చనీయాంశంగా మార్చాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ సభ్యుల వైరం బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్ వర్సెస్‌గా మారిందని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీలోని వారసత్వం పోరే ప్రస్తుత పరిణామాలకు కారణమని తెలుగు టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. పార్టీలో ఏ స్థాయిలో ఉంటారో జూనియర్ ఎన్టీఆర్ తేల్చుకోవాలని పార్టీ సీనియర్లు అంటున్నట్లు కూడా ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉంటారని అర్థమవుతోందని అంటున్నారు. తాజా వివాదానికి దమ్ము సినిమా చూడవద్దంటూ మెసేజ్‌లు పోవడం మరింత అగ్గిని రాజేసింది. 

రాష్ట్రంలోని 18 శానససభా స్థానాల్లో, ఒక లోకసభ స్థానాల్లో అవసరమైతే బాలకృష్ణ ప్రచారం చేస్తారని, జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం ఆహ్వానించవద్దని చంద్రబాబు పార్టీ నాయకులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో  జూనియర్ ఎన్టీఆర్ , హరికృష్ణలకు బాలయ్య, చంద్రబాబులకు మధ్య దూరం పెరిగినట్లేనని భావిస్తున్నారు. తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.