జగన్ జీవితం నేరమయం:రామచంద్రయ్య

జగన్ జీవితం నేరమయం:రామచంద్రయ్య

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు అని, ఐదారు నెలలో ఆయన నేర చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వస్తుందని చిరంజీవి వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య  గురువారం అన్నారు. ఆయనకు చెందిన సాక్షి పత్రికపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

పరువు నష్టం దావా వేస్తామన్నారు. జగన్ అక్రమాలపై ప్రజలందరూ కలిసి పోరాడాలని సూచించారు. జగన్‌లా చిరంజీవి  ప్రజలను దోచుకోలేదన్నారు. ఏ దేశ నాయకుడు కూడా ఇంత వరకు జగన్‌లా ప్రజల సొమ్మును లూటీ చేయలేదని మండిపడ్డారు. వాంగ్మూలం ఇవ్వాలని తిరుపతిలో చట్టం లేకపోయినా సంప్రదాయం ఉందని, విజ్ఞత కలిగిన వారు సంప్రదాయాన్ని గౌరవించి ఉంటే బాగుండేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్‌కు మతిభ్రమించినట్లుందన్నారు. తెలంగాణ సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. బంధుమిత్ర పరివారం బాగుపడేందుకే తెలంగాణ అంశాన్ని కెసిఆర్ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

ఏడువందల మంది విద్యార్థులు, యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కెసిఆర్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు ఆయన సర్టిఫికేట్ అక్కర లేదని, వారి చిత్తశుద్ధి శంకించడం తగదని సూచించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శన వివాదం దురదృష్టకరమని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని, తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇవ్వాలని పొంగులటి డిమాండ్ చేశారు.