ఎందర్ని గెలిపిస్తారో చూస్తా: డిఎల్

ఎందర్ని గెలిపిస్తారో చూస్తా: డిఎల్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. ఆయన బుధవారం కడప జిల్లాలో మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో గెలుపు ఓటములకు బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదేనని ఆయన చెప్పారు. తాను మంత్రిగా తన విధులు నిర్వహిస్తానని, కానీ ఉప ఎన్నికలతో సంబంధం లేదని చెప్పారు.

ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం జరుగుతోందన్నారు. ఆయన నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు గెలుపోటముల బాధ్యత కూడా పూర్తిగా ఆయనదే అని చెప్పారు.

తాను కడప జిల్లాలో జరుగుతున్న మూడు నియోజవర్గాల బాధ్యతను ఏమాత్రం తీసుకోనని చెప్పారు. కడప ఉప ఎన్నికలలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పుడు, తనకు డిపాజిట్ కూడా దక్కలేదని కొందరు మంత్రులు, నేతలు తనను అవహేళన చేశారని అన్నారు.

తనను అవహేళన చేసిన వారు ఇప్పుడు పలు నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ఉన్నారని వారు ఎంత మందిని గెలిపిస్తారో చూస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇంచార్జులుగా ఉన్న మంత్రుల సత్తా ఉప ఎన్నికలతో తేలుతుందని ఆయన చెప్పారు.