జగన్ ఓ పిరికిపంద:ధర్మాన

జగన్ ఓ పిరికిపంద:ధర్మాన

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పిరికి పంద అని మంత్రి  ధర్మాన ప్రసాద రావు  సోమవారం విమర్శించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ఇప్పటికీ తాను లక్ష కోట్లు ఎలా సంపాదించానో సమాధానం చెప్పలేక పోతున్నారన్నారు. రెండేళ్ల ప్రజా జీవితంలో అత్యంత ధనవంతుడిగా ఎదగాలని జగన్ ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.

అలాంటి వ్యక్తికి ప్రజలు ఎలా అధికారం అప్పగిస్తారని ప్రశ్నించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలను చూసి జగన్ నేర్చుకోవాలన్నారు. వారు ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు. అసలు జగన్‌కు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అర్హత ఏమిటని ప్రశ్నించారు. ఆయనకు ఏం అర్హత ఉందని సిఎం పదవి చేపడతారన్నారు.

సమాజం, ప్రజా సమస్యల పట్ల జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే జగన్ పార్టీని స్థాపించారని విమర్శించారు. జగన్‌కు కాంగ్రెసు పార్టీ ఏం నష్టం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఆయనను రెండు సార్లు ప్రజలు పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు.

జగన్ ఒక మతానికి, కులానికి ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నారన్నారు. దేశంలో అతిపెద్ద క్రిస్టియన్  సోనియా గాంధీ అన్నారు. ఆమెను కాదని జగన్‌కు క్రిస్టియన్లు ఓటేస్తారా అన్నారు. కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.