మోహన్ బాబు సరసన శ్రీదేవి

 మోహన్ బాబు సరసన శ్రీదేవి

మోహన్ బాబు విలన్ గా నటించిన ఎన్నో చిత్రాల్లో శ్రీదేవి హీరోయిన్ గా చేసింది. అయితే ఇప్పుడు మోహన్ బాబు సరసన శ్రీదేవి చేసే అవకాశముందని తెలుస్తోంది. మోహన్ బాబు ప్రధానపాత్రతో రాఘవేంద్రరావు రూపొందించనున్న రావణ చిత్రం కోసం శ్రీదేవిని అడిగినట్లు సమాచారం. రావణుడి భార్య మండోదరి పాత్రకు శ్రీదేవి అయితే సరిపోతుందని భావించే రాఘవేంద్రరావు,మోహన్ బాబు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

అయితే శ్రీదేవి మాత్రం తన రేటు రెండు కోట్లు అని చెప్పి మోహన్ బాబు షాక్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇప్పటికీ మోహన్ బాబు...మరొకరు వద్దని ఆమే రేటు తగ్గించుకుంటే తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం 3డి లో భారీగా నిర్మించనున్నారు. 

తాను త్వరలో త్రీడి రావణాసురుడు గా కనిపించి మురపించనున్న విషయాన్ని మోహన్ బాబు స్వయంగా మీడియాకు తెలుపుతూ...రావణుడి ఔన్నత్యాన్ని చెప్పే సినిమా ఇది. ఇంతకుముందు ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావులాంటి మహా నటులు ఈ పాత్రలో కనిపించారు. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా శైలిలో రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తాను. భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారు. అధునాతన త్రీడీ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని అన్నారు. 

వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ తరవాత సంభాషణలు ఆ స్థాయిలో పలికే నటుడు మోహన్‌బాబు. మా ఇద్దరి కలయికలో మంచి చిత్రాలొచ్చాయి. 'రావణ' కూడా అదే స్థాయిలో ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని అన్నారు.మైధలాజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాఘవేంద్రరావు,నాగార్జున కాంబినేషన్ లో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. అలాగే మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై రాయుడుగారికి కోపమొచ్చింది అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.