మోపిదేవి రూ.8 కోట్లు లంచం తీసుకున్నారు

మోపిదేవి రూ.8 కోట్లు లంచం తీసుకున్నారు

ఎక్సైజ్ శాఖ మంత్రి  మోపిదేవి వెంకట రమణ రూ.8 కోట్లు  లంచం తీసుకున్నట్లుగా విచారణలో తేలిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గురువారం వెల్లడించింది. మోపిదేవిని తాము అరెస్టు చేసినట్లు సిబిఐ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు తెలిపింది. అంతకుముందు ఆయన విచారణ కోసం దిల్ కుషా అతిథి గృహానికి వచ్చారు. అదే సమయంలో సిబిఐ అతనిని అరెస్టు చేసింది.

అనంతరం సిబిఐ మోపిదేవి అరెస్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సిబిఐ పలు అంశాలను వెల్లడించింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖా మంత్రిగా పని చేసిన మోపిదేవి వాన్‌పిక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇష్టానుసారం జివోలు జారీ చేసినట్లు తమ విచారణలో తేలినట్లు పేర్కొంది.

ఇందుకోసం మంత్రి రూ.8 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలిందన్నారు. దీనితో అవినీతితో పాటు ఖజానాకు నష్టం కలిగించిన ఆరోపణలతో విచారణ నిమిత్తం దిల్ కుషా అతిథి గృహానికి వచ్చిన మోపిదేవిని అరెస్టు చేశామని తెలిపింది. మంత్రిపై 120 (బి), రెడ్‌విత్ 420, 477 (ఎ), 409 పాటు 13 (1) డి, 13(2)ఆర్‌డబ్యు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మోపిదేవి అరెస్టు వివరాలను సిబిఐ అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

మోపిదేవి జారీ చేసినట్లుగా చెబుతున్న వివాదాస్పద జివోలు.. జివో నెంబర్ 29.. వాన్‌పిక్‌కు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుండి మినహాయింపులు, జివో నెంబర్ 30 వాన్‌పిక్‌కు రాయితీల ఒప్పందానికి ఆమోదం, జివో నెంబర్ 31 వాన్‌పిక్‌కు భూసేకరణ ముసాయిదా. సమగ్ర ఆధారాలు సేకరించినట్లుగా సిబిఐ తెలిపింది. మరోవైపు మోపిదేవి వెంకట రమణను జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా చేర్చుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.

కాగా మంత్రి మోపిదేవి అరెస్టుకి జగన్ అక్రమాస్తుల కేసు మూలం కావడం మరో కీలక పరిమామం. రాష్ట్ర చరిత్రలో అవినీతి ఆరోపణలతో మంత్రి ఒకరు అరెస్టు కావడం ఇదే తొలిసారి. అందునా అవినీతి ఆరోపణలతో, ముడుపులు అందుకొని ఖజానాకు నష్టం కలిగించిన ఆరోపణలతో స్వయంగా సిబిఐ అదుపులోకి తీసుకోవడం విశేషం. కాగా మోపిదేవి అరెస్టుతో హైదరాబాదులో 144న సెక్షన్ విధించారు.