మోపిదేవి అరెస్ట్: కార్యకర్తల విధ్వంసం

మోపిదేవి అరెస్ట్: కార్యకర్తల విధ్వంసం

మోపిదేవి వెంకటరమణ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆయన అభిమానులు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మోపిదేవి సొంత జిల్లా గుంటూరు జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు బందుకు పిలుపునిచ్చారు.  మోపిదేవి అరెస్టుపై గుంటూరులో  కాంగ్రెసు తీవ్రంగా నిరసనలు తెలిపింది. మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాలలో అభిమానులు ఆందోళనకు దిగారు.

రేపల్లెలో నాలుగు బస్సులను ధ్వంసం చేశారు. నిజాంపట్నంలో ఓ బస్సును దహనం చేశారు. మోపిదేవి అరెస్టును నిరసిస్తూ రేపల్లెతో పాటు గుంటూరు బందుకు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పలు చోట్ల దుకాణాలను మూయిస్తున్నారు. కొందరు కార్యకర్తలు ఆగ్రహం పట్టలేక రేపల్లె మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. ఎస్ఐ జీపు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సులపై రాళ్లు రువ్వుతున్నారు.

అవినీతి, అక్రమాలకు కారకుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులను అరెస్టు చేయకుండా కేవలం బిసి వర్గానికి చెందిన మంత్రిని అరెస్టు చేయడమేమిటని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా మోపిదేవి అరెస్టు నేపథ్యంలో హైదరాబాదులోని సిబిఐ కార్యాలయం దిల్ కుషా అతిథి గృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబిఐ కార్యాలయం ముందు పలువురు మోపిదేవి అనుచరులు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా జగన్ ఆస్తుల కేసులో ఇది నాలుగో అరెస్టు. మోపిదేవి అరెస్టుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులలో ఆందోళన నెలకొంది.