మంత్రి పదవికి రాజీనామా చేసిన మోపిదేవి

మంత్రి పదవికి రాజీనామా చేసిన మోపిదేవి

 తనను అరెస్టు చేస్తున్నట్లు సిబిఐ చెప్పగానే మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కొద్ది సేపటి క్రితం పంపినట్లు సమాచారం. తాను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మోపిదేవి అరెస్టును  సిబిఐ  అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు తాను రాజీనామా చేయడానికి మోపిదేవి నిరాకరించారు. అయితే మరో వార్త కూడా వినిపిస్తోంది. బుధవారం రాత్రే తన రాజీనామా లేఖను మోపిదేవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. దాన్ని ముఖ్యమంత్రి గవర్నర్‌కు పంపించారు. మోపిదేవి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్ ఆస్తుల కేసు లో విచారణను ఎదుర్కుంటున్న ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఒత్తిడి పెంచింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు సమాచారం. అయితే, అందుకు ఆయన విముఖత ప్రదర్శించారు. రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్లవుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. 

మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించాలని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం పెద్దలు ఫోన్ చేసి రాజీనామా చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి నుంచి ఆయనకు అధిష్టానం నుంచి ఆయనకు ఫోన్లు వచ్చాయి. అయితే, రాజీనామాకు ఆయన మొండికేశారు. తనను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 

మోపిదేవి అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. మోపిదేవి వెంకటరమణ  బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కలిశారు. అయితే, వారు ఆయనకు ఏ విధమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చూద్దాం అంటూ పొడిపొడిగా మాట్లాడినట్లు తెలిసిందే.