జ్యుడిషియల్ కస్టడీకి నిమ్మగడ్డ ప్రసాద్

జ్యుడిషియల్ కస్టడీకి నిమ్మగడ్డ ప్రసాద్

 వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది. సిబిఐ కస్టడీపై గురువారం విచారణ జరగనుంది. అరెస్టు చేసిన తర్వాత మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందని న్యాయమూర్తి వారిని ప్రశ్నించింది. అయితే, తమ పట్ల సరిగానే సిబిఐ వ్యవహరించిందని నిమ్మగడ్డ ప్రసాద్ న్యాయమూర్తికి చెప్పారు. 

తమను 41 నోటీసులు తాము అందుకున్నామని, 13 సార్లు నిమ్మగడ్డ ప్రసాద్‌ను విచారించారని, సిబిఐ అధికారులకు సహకరించి పూర్తి వివరాలు అందించారని, ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదని ఆయన తరఫు న్యాయవాది సిబిఐ కస్టడీని వ్యతిరేకిస్తూ కోర్టుకు చెప్పారు. రేపు తాము కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పారు. వైయస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది.

వైయస్ జగన్ కేసులో అరెస్టు చేసిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ అధికారులు బుధవారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో వీరిద్దరిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం వారిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిని మధ్యాహ్నం హైదరాబాదులోని దిల్‌కుషా అతిథి గృహం నుంచి కోర్టుకు తరలించారు. 

వైయస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 842 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిఫలంగా ఆయన వాన్‌పిక్ పేరిట ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుకూలంగా అధికారి బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారని, వీరిద్దరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది. 

మంత్రివర్గం నిర్ణయానికి విరుద్ధంగా ప్రసాద్‌కు మేలు చేయడానికి జీవోలు జారీ చేశారని అంటున్నారు. వాన్‌పిక్‌కు కేటాయించడానికి భూములను రిజర్వ్ చేయాలని రెండు జిల్లా కలెక్టర్లకు కూడా బ్రహ్మానంద రెడ్డే లేఖ రాశారని అంటున్నారు. బ్రహ్మానంద రెడ్డిని వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా చేర్చాలని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.