సిబిఐకి ఆ దమ్ము లేదు

సిబిఐకి ఆ దమ్ము లేదు

విచారణలో ఏయే ప్రశ్నలకు నిమ్మగడ్డ ప్రసాద్ సమాధానం ఇచ్చారో రిమాండు రిపోర్టులో చేర్చే దమ్ము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి లేదని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. గురువారం సిబిఐ ప్రత్యేక కోర్టులో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిల సిబిఐ కస్టడీ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

నిమ్మగడ్డపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకే సిబిఐ తన కస్టడీని అడుగుతోందని అన్నారు. ఆయన అరెస్టు పూర్తిగా అక్రమం అన్నారు. అతను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. నిమ్మగడ్డ వల్ల కూడా ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఒక దేశంతో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం మాత్రమే అని చెప్పారు. ప్రభుత్వం నష్టపోయిందని చెప్పడం అవాస్తవమన్నారు. ఇప్పటికీ పోర్టులు ప్రభుత్వం ఆదీనంలోనే ఉన్నాయని చెప్పారు. రిమాండు డైరీలోని నిజాలు చెప్పేందుకు సిబిఐ భయపడుతోందన్నారు.

అక్రమ అరెస్టులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. అలా అయితే ప్రభుత్వానికి, ప్రజలకు తీవ్ర నష్టమన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే నిమ్మగడ్డ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సిబిఐ ఎస్పీ వెంకటేష్‌కు నిజాలు చెప్పే ధైర్యం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జారీ అయిన 26 జివోలు అప్పటి కేబినెట్ ఆమోదం పొందినవే అని చెప్పారు.

సిబిఐ ఛార్జీషీటులో ఎక్కడా నిమ్మగడ్డ పేరు లేదన్నారు. పోర్టు లాండ్ ప్రభుత్వానిదేనని లీజుకు తీసుకున్నామని చెప్పారు.  నిమ్మగడ్డ ప్రసాద్  వాన్‌పిక్ భూమి ద్వారా ట్రిపుల్ బెనిఫిట్ పొందారని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. రైతుల నుండి తక్కువ ధరకు భూములు కొన్నారన్నారు. రైతులకు కలెక్టర్ ద్వారా డబ్బులు ఇవ్వకుండా సొంతగా చెల్లించి రూ.350 కోట్లు బెనిఫిట్ పొందారన్నారు. కెబినెట్ ఆమోదం లేకుండానే వాన్‌పిక్‌కు భూములు కేటాయించారన్నారు.

ఆయనను ఈ విషయంపై చాలాసార్లు విచారించిన సమాధానం రాలేదన్నారు. ఆయనను పదిహేను రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది. లేదంటే కేసు ముందుకు సాగదని తెలిపింది. కాగా ఇరువైపుల వాదనలు విన్న సిబిఐ  కోర్టు తీర్పును సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేసింది. కాగా అనంతరం బ్రహ్మానంద రెడ్డి కస్టడీ పిటిషన్ పైన వాదనలు ప్రారంభమయ్యాయి.