శ్రీవారికి చరణ్-ఉపాసన వెడ్డింగ్ కార్డ్

శ్రీవారికి చరణ్-ఉపాసన వెడ్డింగ్ కార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని పెళ్లి పత్రిక శ్రీవారి చెంతకు చేరింది.  చిరంజీవి సతీమణి సురేఖ  శుక్రవారం శ్రీవారిని దర్శించుకుని తమ కుమారుని పెళ్లి పత్రికను శ్రీవారి హుండీలో వేశారు. చెర్రీ, ఉపాసన జూన్ 14న వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే.

పెళ్లి వేడుక నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్ సాగర్ సమీపంలోని ఉపాసన కుటుంబీకుల ఫాంహౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిఐపిలు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో భద్రత ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. అదే విధంగా నగరంలోని లగ్జరీ హోటల్స్ అన్నీ చెర్రీ ఉపాసన వేడుకకు హాజరయ్య అతిథుల కోసం ముందస్తుగానే బుక్ అయిపోయాయి. 

అయితే ఈవేడుకలోకి సాధారణ జనాలకు, అభిమానులకు అసలు ప్రవేశమే లేదు. వారి కోసం ప్రత్యేకంగా వివాహం మరుసటి రోజు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ చిత్రం ‘జంజీర్'తో పాటు, తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంలో నటిస్తున్నాడు. పెళ్లి నేపథ్యంలో దాదాపు నెల రోజుల పాటు రామ్ చరణ్  తను నటిస్తున్న సినిమాల షూటింగులన్నింటీకి విరామం ఇవ్వనున్నాడు.