సిఎం కావాలని జగన్ పట్టు: బొత్స

సిఎం కావాలని జగన్ పట్టు: బొత్స

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశాడని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఉప ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని జగన్ భావిస్తున్నారన్నారు.

తన తండ్రి మృతి చెందడంతో ఆ కుర్చీ తనకు చెందాలని ఆయన పట్టుబడుతున్నాడని ఆరోపించారు. జగన్ దివంగత వైయస్ సంపాదించిన ఆస్తులకు వారసుడు అవుతాడు కానీ కుర్చీకి కాదని చెప్పారు. కాంగ్రెసు పార్టీకి అధికారం ముఖ్యం కాదన్నారు. ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. కాంగ్రెసు పార్టీలోని అందరు నేతలు కలిస్తేనే అప్పుడు వైయస్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

జగన్‌కు బియ్యానికి, వరికి తేడా తెలియదని, అలాంటి వ్యక్తి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చీప్ విఫ్ గండ్ర వెంకట రమణా రెడ్డి హైదరాబాదులో అన్నారు. జగన్ ఇంటి పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదన్నారు. జగన్‌కు డెబ్బై గదుల ఇల్లు ఎందుకని ప్రశ్నించారు. జగన్‌కు వ్యవసాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. విలాసవంతమైన భవనాలలో నివసించే అతనికి రైతుల గురించి తెలుస్తుందా అన్నారు.

కాంగ్రెసు ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉప ఎన్నికల తర్వాత కూడా కిరణ్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఆరోగ్యశ్రీ గురించి జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మరో నేత తులసి రెడ్డి అన్నారు. ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి నమ్మించాలని జగన్ చూస్తున్నారన్నారు. పాలన చక్కగా ఉందని, ఆరోగ్యశ్రీ కొనసాగుతోందన్నారు.

వైయస్ జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని న్యూఢిల్లీలో వి హనుమంత రావు డిమాండ్ చేశారు. లక్ష రూపాయలు తీసుకున్న బంగారు లక్ష్మణ్‌ను జైలుకు పంపారని, కానీ కోట్లు సంపాదించిన జగన్‌ను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఆస్తుల కేసులో జగనే మొదటి ముద్దాయి అని చెప్పారు.

తన తండ్రి హయాంలో జగన్ అవినీతితో కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. విజయ సాయి రెడ్డి, కోనేరు ప్రసాద్‌ల కంటే జగన్ మోస్ట్ డేంజరెస్ అన్నారు. ఆయన బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు అవుతాయని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ అవినీతిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించాలన్నారు.