వైయస్సార్ అంటే చెప్పలేని స్థితి

వైయస్సార్ అంటే చెప్పలేని స్థితి

 వైయస్సార్ కాంగ్రెసు అంటే ఏంటో చెప్పుకోలేని దీనస్థితిలో ఆ పార్టీ ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  బుధవారం అన్నారు. ఆయన విశాకపట్నంలోని పాయకరావుపేటలో ఉప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ పేరు చెప్పుకోలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు  ఉందన్నారు. విధి విధానాలు ఏమాత్రం లేని పార్టీ ఆ పార్టీ అన్నారు.

ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం  పార్టీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తి అని మండిడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన అన్ని పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా నడిపిస్తున్నామని చెప్పారు. వైయస్ హయాం నుంచి స్కాలర్ షిప్‌ల బకాయిలను తమ ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. రాష్ట్రంలో వైయస్ పాలన కొనసాగుతున్నా ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో 95 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అంతకుముందు పాయకరావుపేటకు వెళుతూ మార్గమధ్యలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

జగన్ సంస్థలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో సిబిఐ దర్యాఫ్తు చేస్తోందని కిరణ్ అన్నారు. ఖాతాల స్తంభనతో ప్రభుత్వానికి, పార్టీలకు, ఇతర మీడియాకు సంబంధం లేదని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే వైయస్ జగన్ ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్తంభన సాక్షికి, సిబిఐకి సంబంధించిన విషయమన్నారు. అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకే జగన్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెసు పార్టీకి కార్యకర్తలే మీడియా అని చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మాయమాటలు చెబితే నమ్మి ఓటేసే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఓటర్లు చాలా తెలివైన వారని చెప్పారు. ఒక్కో సమయంలో ఒక్కో అంశంపై ఎన్నికలు జరుగుతాయన్నారు.  ఉప ఎన్నికల లో అన్ని సీట్లు కాంగ్రెసు కైవసం చేసుకుంటుందని చెప్పారు. పార్టీకి మేలు చేసేలా ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని చెప్పారు.