వైయస్ మృతిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

వైయస్ మృతిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

 దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిలో కుటుంబ సభ్యుల కుట్ర ఉందేమోనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ గురువారం అనుమానం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చనిపోయిన  వైయస్ రాజశేఖర రెడ్డి ని ప్రస్తుత రాజకీయాలలోకి లాగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

వైయస్ మృతిని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూస్తుంటే కుటుంబ సభ్యుల కుట్ర ఉందేమోననే అనుమానం కలుగుతోందన్నారు. ఎంతమంది కాంగ్రెసు పార్టీని వీడినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎమ్మెల్యేలపై ఉపేక్ష వహించమన్నారు. వైయస్ విజయమ్మను కలిసిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

వైయస్ విజయమ్మ వ్యాఖ్యలు చూస్తుంటే రాజ్యకాంక్షతో వీరే ఏమైనా చేశారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. విజయమ్మకు తన పార్టీ పూర్తి పేరు తెలుసా అని ప్రశ్నించారు. పార్టీ గుర్తులోని కాంగ్రెసు పార్టీ పథకాలు తొలగించి జగన్ అక్రమ కంపెనీల గుర్తులుపెట్టుకోవాలని సూచించారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిలాంటి ఎందరు నేతలు పార్టీని వీడినా దోపిడీ దొంగలను మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు.

జగన్ అతి తక్కువ కాలంలో అత్యంత సంపన్నపరుడు ఎలా అయ్యాడని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఏడు లక్షల రూపాయల ఆస్తి ఉన్న జగన్ అతి తక్కువ కాలంలో రూ.400 కోట్లు ఎలా సంపాదించారని ఉండవల్లి ప్రశ్నించారు. అతి తక్కువ కాలంలో కోట్లాది రూపాయలు సంపాదించడంపై సిబిఐ అధికారులు ప్రశ్నిస్తే తప్పువుతుందా అన్నారు.

జివోలు జారీ చేసిన మంత్రులు జైలుకు వెళితే వాటి ద్వారా లబ్ధి పొందిన జగన్ మాత్రం బయట ఉండాలా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ ప్రమాదం, వైయస్ మృతిపై అనుమానాలు ఉంటే జగన్ ఎంపీగా ఉండి పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదన్నారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ ఇన్నాళ్లూ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.