ప్రతిచోట కోవర్టులు ఉన్నారు: బొత్స

ప్రతిచోట కోవర్టులు ఉన్నారు: బొత్స

ప్రతి చోట కోవర్టులు ఉంటారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్సతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖలో ఉప ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు.

త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో పద్దెనిమిది స్థానాలలో గెలుపు కోసం కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెసులోకి మరిన్ని వలసలు పెరుగుతాయని ఆయన చెప్పారు. రాజకీయ వ్యూహంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలలో ఫలితాలపై చెప్పేందుకు తాము జ్యోతిష్యులం కాదన్నారు.

పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుల కోసం ఒరిస్సా, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతామని ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  చెప్పారు. పోలవరంపై అభ్యంతరాలను ఓడిశా సిఎంతో చర్చిస్తానని అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి ఎక్కడ పని లేక నిత్యం విమర్శలు చేస్తున్నారని కొట్టి పారేశారు. రాబోయే ఉప ఎన్నికలలో పద్దెనిమిది స్థానాలలో కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందని చెప్పారు.

ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల జాతీయ హోదా కోసం కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై మీడియా దృష్టి పెడితే బాగుంటుందని ఆయన సూచించారు.  ఉప ఎన్నికల లో గెలుపుపై ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాగా విశాఖలో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు ప్రచారం నిమిత్తం బయలుదేరి వెళ్లారు.