తెలంగాణలో పోటీ చేసే ధైర్యం లేదు: బొత్స

తెలంగాణలో పోటీ చేసే ధైర్యం లేదు: బొత్స

 వైయస్సా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో పోటీ చేసే ధైర్యం కూడా లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకే తెలంగాణ ఉప ఎన్నికల్లో ఇంతకు ముందు పార్టీ అభ్యర్థులను పోటీకి దించలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని ఆయన అన్నారు. 

కాంగ్రెసు పథకాలను వైయస్ జగన్ తన సొంత పథకాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తోందని, మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నడనివ్వబోమని జగన్ అంటున్నారని ఆయన అన్నారు. 

ప్రభుత్వాని నడనివ్వకూడదనే దురద్దేశంతో, డబ్బుతో ఉప ఎన్నికలను జగన్ తెచ్చారని ఆయన అన్నారు. మేం ఏది చెప్తే అదే జరిగాలనే వైయస్ జగన్ స్వార్థపూరిత ఆలోచనలే ప్రస్తుత ఉప ఎన్నికలకు కారణమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే అంచనా వేసుకుంటే జగన్ స్వార్థ చింతన తెలిసిపోతుందని ఆయన అన్నారు. 

కాంగ్రెసు పార్టీ నాయకులు ఇటీవలి కాలంలో వైయస్ జగన్‌పై విమర్శల దాడిని పెంచారు. బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైయస్ జగన్‌పై విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దీటుగా కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్‌పై ధ్వజమెత్తుతున్నారు.