మోపిదేవి అరెస్టుపై బొత్స సత్తిబాబు

మోపిదేవి అరెస్టుపై బొత్స సత్తిబాబు

 వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో  మంత్రి మోపిదేవి వెంకటరమణ  అరెస్టు కావడంపై మాట్లాడడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడడానికి నిరాకరించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాలు బాధాకరమని ఆయన అన్నారు. మోపిదేవి అరెస్టు వార్తను తాను టీవీలోనే చూశానని ఆయన అన్నారు.

మోపిదేవి అరెస్టయిన వార్త బయటకు రాగానే బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామా లేఖను బొత్స సత్యనారాయణ గవర్నర్‌కు అందించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం ధ్రువపడడం లేదు. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు నిరాకరించిన మోపిదేవి ఆ తర్వాత రాజీనామా లేఖను రాసి పంపినట్లు చెబుతున్నారు. 

అవినీతి ఆరోపణలు రుజువైతే చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెప్పడానికి మంత్రి మోపిదేవి అరెస్టే నిదర్శనమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు గురువారం గుంటూరు జిల్లాలో అన్నారు. మంత్రులపై అభియోగాలు రావడానికి కారకుడైన మూల విరాట్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 

మంత్రి మోపిదేవి అరెస్టు వెనక కాంగ్రెసు అధిష్టానం కుట్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిసి సెల్ కన్వీనర్ గట్టు రామచంద్ర రావు అన్నారు. బిసి మంత్రిని బలిపశువును చేశారని ఆయన అన్నారు. మోపిదేవిని పావుగా చేసుకుని జగన్‌ను అరెస్టు చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. మోపిదేవిపై ఒత్తిడి తెచ్చి జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.