జ్ఞాపకార్థం ట్రస్టు నెలకొల్సిన చిత్ర

 జ్ఞాపకార్థం ట్రస్టు నెలకొల్సిన చిత్ర

ప్రముఖ గాయని చిత్ర తన కూతురు నందన జ్ఞాపకార్థం ‘స్నేహ నందన' చారిటబుల్ ట్రస్తును స్థాపించారు. ఈ ట్రస్టు ద్వారా పేదరికంలో మగ్గుతున్న వృద్ధ గాయనీగాయకులకు ఆర్ధిక సాయం అందించనున్నారు.

ఈ ట్రస్టు స్థాపించడానికి గల కారణాలపై గాయని చిత్ర మాట్లాడుతూ.. తిండికి కూడా నోచుకోని వృద్ధ కళాకారులు ఈ రోజు ఎంతో మంది వున్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఈ ట్రస్టు నెలకొల్పాం. అటువంటి కళాకారులను గుర్తించి వారికి ఆర్ధిక సాయం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇద్దరు వృద్ధ కళాకారులను గుర్తించడం జరిగిందనీ, వారికి నెలకు రూ. 3000 రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ చేతుల మీదుగా ఈ ట్రస్ట్ త్వరలో ప్రారంభిస్తామన్నారు.

చిత్ర తన తీయని కమఠ స్వరంతో కోట్లాది అది శ్రోతల వీనుల్లో అమృతం నింపితే, ఆమె జీవితంలో మాత్రం దయలేని ఆ భగవంతుడు హలాహలాన్నే నింపాడు. గాయని చిత్ర, విజయ్ శంకర్ దంపతులకు వివాహం జరిగిన పదిహేనేళ్ళకు ఎన్నో నోముల, వ్రతాల, పూజల ఫలితంగా లేక లేక కలిగిన ఏకైక సంతానం బేబీ నందన. షార్జా స్టేడియంలో రెహమాన్ సంగీత విభావరిలో పాల్గొనేందుకు సకుటుంబంగా గాయని చిత్ర దుబాయ్ కి వెళ్ళారు. అక్కడ ఒక రిసార్ట్ లో విల్లాలో చిత్ర కుటుంబానికి బస ఏర్పాటు చేశారు. ఆ విల్లాలోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తూ పడి బేబీ నందన మరణించింది. గత సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఈ ఘటనచోటు చేసుకుంది.