‘విక్రమసింహా'గా రజనీకాంత్ ఖరారు

‘విక్రమసింహా'గా రజనీకాంత్ ఖరారు

తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న ‘కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్‌కి ‘విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారనేది విశ్వసనీయ సమాచారం. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు.  దీపికా పదుకొనే  ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

రజనీకాంత్ చిత్రం గురించి మాట్లాడుతూ...''ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాశక్తి, మైమింగ్‌ అవసరముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాదు. మోషన్‌ టెక్నాలజీతో షాట్స్‌ తీయడం ఒక సవాల్‌ ... ఇదొక టఫ్‌ జాబ్‌ అన్నారు. అలాగే ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్‌' ఒక విందులాంటిదని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్‌ మెటీరియల్‌ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు.  రజనీ కాంత్‌, శరత్‌కుమార్‌, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.సినిమా గురించి దర్శకురాలు మీడియాతో మాట్లాడుతూ.. ''కోచ్చడయాన్‌' సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో నటించడం అంత సులభం కాదు. సవాల్‌తో కూడుకున్న విషయం. ఊహకే అంతుచిక్కని లొకేషన్లు ఇందులో కనిపించడం విశేషం. ఇదో ఫాంటసీ సినిమా. కేవలం పిల్లల్నే గాక అందర్నీ ఈ సినిమా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదలవుతుంది''అని తెలిపారు. 

ఎరోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సునీల్ లుల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ అధినేత బి.సుబ్రహ్మణ్యం దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. శరత్‌కుమార్, ఆది పినిశెట్టి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో శోభన, నాజర్, జాకీష్రాఫ్, రుక్మిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ మీనన్.