నట్టికుమార్ ప్రారంభ వ్యాపారం ఇదీ...

నట్టికుమార్ ప్రారంభ వ్యాపారం ఇదీ...

గత కొద్ది రోజులుగా సినిమా నిర్మాత నట్టి కుమార్ ఏదో విషయంలో మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన జీవితం త్రవ్వకాలు మొదలయ్యాయి. ప్రారంభరోజుల్లో నట్టికుమార్ విశాఖ నుంచే కెరీర్‌ను ప్రారంభించారు. స్థానిక ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతవాసి అయిన ఈయన మొదట్లో రోడ్డు పక్కన బాటపై దుస్తులు అమ్ముకునేవారు. విశాఖ పరిసరాల్లో తీసే సినిమాలకు సహాయ నటీనటులను పంపిణీ చేస్తుండేవారు. ఆ తర్వాత ఇతర భాషల్లో వచ్చిన శృంగార చిత్రాలను డబ్ చేసి ఉత్తరాంధ్రలో ప్రదర్శించేవారు. 

ఆ తర్వాత 'కరుణాలయ' పేరిట విశాఖలో ఫిలిం డ్రిస్టిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి సినిమాలు పంపిణీ చేసేవారు. అప్పట్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ-1 స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. రియల్ ఎస్టేట్ ఊపు అందుకోవటంతో నట్టి వివాదాస్పద భూములతో లబ్ది పొందారు. భీమిలి, తదితర ప్రాంతాల్లో కూడా నట్టి కొన్ని భూముల లావాదేవీలు జరిపి డబ్బు సంపాదించారు.

ఆ తర్వాత ఆయన నిర్మాతగా తన ప్రస్దానం ప్రారంభించారు. అయితే హఠాత్తుగా నిర్మాత అయ్యేటటువంటి డబ్బు నట్టికు ఎక్కడ నుంచి వచ్చిందనేది మొదటి నుంచి ఆయనతో పరిచయమున్న విశాఖ వాసులకు డౌట్. చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నట్టికుమార్ పెద్ద సినిమాలు తీసే నిర్మాతగా ఎలా ఎదిగారన్నది ఎగ్జిబిటర్లకే అంతుచిక్కట్లేదు. గతంలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన నట్టికుమార్ కొందరు థియేటర్ యజమానుల వద్ద అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు ఫ్లాప్ అయితే ఆ అడ్వాన్స్‌లు కూడా తిరిగి చెల్లించలేదని కొందరు చెప్తున్నారు. 

ఇక నట్టికుమార్ తాజాగా...సినీమాఫియాకు సంబంధించి రెండు మూడు రోజుల్లో సి. కల్యాణ్ ఒక్కడే కాకుండా, సినీ పరిశ్రమలోని ఆరేడుగురు అతిరథ మహారథులు రుజువులతో సహా బయటపడబోతున్నారని నట్టి కుమార్ చెప్పారు. "ఇండస్ట్రీ నుంచి మాఫియాను తరిమికొట్టాలి. కల్యాణ్‌కి కాపలా కాస్తున్న ఇండస్ట్రీలోని తిమింగలాల్ని తరిమికొట్టాలి. మూవీ టవర్స్‌లోని కొన్ని ఫ్లాట్లు సినిమావాళ్లకి కాకుండా బయట వ్యక్తులకి ఎలా వెళ్లాయో తేలాలి'' అని తన డిమాండ్లు ఏమిటో చెప్పారు.