ఇజ్జత్‌ కా సవాల్‌ అన్న చిరు

ఇజ్జత్‌ కా సవాల్‌ అన్న చిరు

 తనకు తిరుపతి గెలుపు ఇజ్జత్ కా సవాల్ అని రాజ్యసభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు  చిరంజీవి శుక్రవారం అన్నారు. ఆయన తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ చేసిన అభివృద్ధే తిరుపతిలో తమ అభ్యర్థిని గెలిపిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో వలె భూపందేరాలు లేకపోవడమే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా అని ఆయన చెప్పారు.

ప్రత్యేక పరిస్థితులలోనే తాను తిరుపతిని విడిచి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఉప ఎన్నికలలో వెంకట రమణ గెలుపు తనకు ఓ సవాల్ అన్నారు. తిరుపతి అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వెను వెంటనే స్పందిస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మనకు అదృష్టమన్నారు. కిరణ్ ప్రభుత్వం ఏ పథకాన్ని తుంగలో తొక్కిందో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.

విపక్షాలు కిరణ్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు కోరుకుంటున్న వెంకట రమణను తాము అభ్యర్థిగా నిర్ణయించామని చెప్పారు. ప్రజలకు సేవ చేస్తే తిరుపతి వెంకన్నకు సేవ చేసినట్లే అన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిని అయినప్పటికీ తిరుపతికి శాశ్వత సభ్యుడిని అన్నారు. వెంకట రమణతో కలిసి తిరుపతి అభివృద్ధిపై దృష్టి సారిస్తానని చెప్పారు. గత మూడేళ్లుగా తిరుపతిలో ఎలాంటి అరాచకాలు, దోపిడీలు లేవని చెప్పారు.

గతంలో కొందరు రకరకాల పేర్లు చెప్పి వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకున్నారన్నారు. కానీ  కిరణ్  ప్రభుత్వం అలా కాదన్నారు. తిరుమల పవిత్రత కాపాడాల్సి ఉందని చెప్పారు. భక్తుల మనోభావాలని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. తన పైనో, కాంగ్రెసు పైనో అభిమానంతో కాకుండా శ్రీవారి పైన ప్రేమతో కాంగ్రెసుకు పట్టం కట్టాలని కోరారు.

నిజాయితీకి పట్టం కట్టాలని, దోచుకున్న వారికి పట్టం కట్టవద్దన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారిని గెలిపిస్తే ఇక్కడ దోచుకుంటారన్నారు. అలాంటి దోపిడీదారుల వల్ల శ్రీవారికి అన్యాయం జరగకుండా ఉండాలంటే కాంగ్రెసుకు ఓటు వేయాలన్నారు. వరుసలో నిలబడితే శ్రీవారి దర్శనం ఎప్పుడో జరుగుతుందని, కానీ ఇక్కడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దర్శనం మాత్రం జరగదన్నారు.

అన్యాయం చేసే వారికి ఓటు వేయవద్దని సూచించారు. తిరుపతిలో అభ్యర్థిని గెలిపించి తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తానని మాట ఇస్తానని చెప్పారు. ప్రజారాజ్యం,  కాంగ్రెసు  ఓట్లు కలిస్తే వెంకట రమణ గెలుపు ఈజీ అని తాను సోనియాకు చెప్పానన్నారు.