జగన్‌కు ఓటుపై చిరంజీవి నినాదం

జగన్‌కు ఓటుపై చిరంజీవి నినాదం

  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  పైన రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి నిప్పులు చెరిగారు. గురువారం  చిరంజీవి  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన కోట్లాది రూ పాయలతో సంవత్సరాలపాటు ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను నమ్ముకున్న వారు జైలుపాలు కాక తప్పదన్నారు. ప్రజలకు మేలు చేసే కాంగ్రెసుకు పట్టం కట్టారని ఆయన ప్రజలను కోరారు. జగన్ చేసేది ఓదార్పు యాత్ర కాదని రాజకీయ యాత్ర అన్నారు.

జగన్‌కు ప్రజలకు చేటు అని ఆయన నినాదం ఇచ్చారు. జగన్‌ది స్వార్ధ రాజకీయమని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆయన అక్రమార్జనకు అంతూ పొంతూ లేదన్నారు. పదవీ కాంక్షతోనే వేరు కుంపటి పెట్టారని ఆరోపించారు.

తనది స్వార్థమే అయితే ప్రజారాజ్యం పార్టీని అలాగే కొనసాగించి కాంగ్రెసు పార్టీని బ్లాక్ మెయిల్ చేసే వాడిని అన్నారు. తాను జగన్‌లా అక్రమార్జన చేయలేదన్నారు. నిజాయితీతో ప్రజారాజ్యం పార్టీని నడిపించానని చెప్పారు. జగన్ ఓదార్పులో బుగ్గలు నిమురుతున్నారని, కానీ ఆ ఓదార్పు యాత్రకు ఖర్చు పెట్టే కోట్ల రూపాయలలో సగం డబ్బులు పేదలకు ఇచ్చినా బాగుండేదన్నారు.

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ వేగానికి కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదని తులసి రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఉప ఎన్నికలను కాంగ్రెకు రిఫరెండం కాదన్నారు. మిగతా పార్టీలు రిఫరెండంగా తీసుకుంటే తాము కూడా అలాగే తీసుకుంటామని చెప్పారు. రాజ్యాంగంలో రిఫరెండం అనే మాట లేదన్నారు.

ప్రతి కేసులో జరిగేదానినే సిబిఐ జగన్ కేసులోనూ పాటిస్తోందని చెప్పారు. ప్రజా కోర్టులో ఓడితే కేసులు కొట్టి వేయడం కానీ, గెలిస్తే గానీ కేసులు పెట్టడం కానీ జరగదన్నారు. జగన్ ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. కాగా అంతకుముందు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.