నాలుగు భాషల్లో రాజమౌళి ‘ఈగ'

నాలుగు భాషల్లో రాజమౌళి ‘ఈగ'

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఈగ' చిత్రం భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం పాటు హిందీలోనూ ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కన్నడంలో డబ్బింగ్ చిత్రాలు నిషేదం కాబట్టి అక్కడ ఈ చిత్రాన్ని నేరుగా తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరుక ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మే 30వ తేదీన గానీ....జూన్ నెలలోగానీ ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే అతను ఈగ రూపంలో విలన్‌పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత , సుదీప్ అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అన్నారు. 

ఫేస్ బుక్, ట్విట్టర్, మీడియా, టీవీ ఛానెల్స్ అనే తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ లెవల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం, కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం, పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటంతో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత: సాయి కొర్రపాటి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.