నళిని వెనక ఎవరున్నారు?

నళిని వెనక ఎవరున్నారు?

 వరంగల్ జిల్లా పరకాల శాసనసభా నియోజకవర్గంలో పోటీకి  డిఎస్పీ నళిని  సిద్ధపడడం వెనక ఎవరున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ నినాదంపైనే ఆమె పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే గ్రామీణ స్పూర్తి యాత్ర పేరు మీద ప్రచారాన్ని సాగిస్తున్నారు. 

తనకు మద్దతు ఇవ్వాలని ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని, బిజెపిని, తెలంగాణ రాజకీయ జెఎసిని కోరింది. తెలంగాణ జెఎసి తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరారు. అయితే, తెరాస, బిజెపిలు గానీ తెలంగాణ జెఎసి గానీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఆమె పోటీ చేయడానికి సిద్ధపడడం వెనక ఎవరున్నారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నళిని డిఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఆమె పోటీ చేయాలంటే ప్రభుత్వం ఆ రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. తన రాజీనామాను ఆమోదింపజేయాలని ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. తాను నామినేషన్ వేసేనాటికి రాజీనామా ఆమోదంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు నళిని అంటున్నారు. తన వెనక ఎవరో ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ఆమె తప్పు పడుతున్నారు. తాను తెలంగాణ కోసమే పోటీ చేస్తున్నానని, తన వెనక ఎవరూ లేరని, గిట్టనివారు తనపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆమె అంటున్నారు. 

పరకాలలో జయాపజయాలను తారుమారు చేయడానికి నళిని పోటీకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నళిని పోటీ, తెలంగాణవాదాన్ని మోస్తున్న బిజెపి, తెరాసల పోటీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖకు కలిసి వస్తుందనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. రాష్ట్రంలోని 18 శాసనసభా నియోజకవర్గాలకు జూన్‌లో ఉప ఎన్నికలు జరుగుతుండగా, పరకాల మాత్రమే  తెలంగాణ లో ఉంది. ఈ సీటులో విజయానికి బిజెపి, తెరాసలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.