నిరూపిస్తే చెప్పు దెబ్బలు తింటా: కేసిఆర్

నిరూపిస్తే చెప్పు దెబ్బలు తింటా: కేసిఆర్

 తెలంగాణలో అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే పరకాల చౌరస్తాలో చెప్పుదెబ్బ తినేందుకు తాను సిద్ధమని, నిరూపణ చేయకపోతే అందుకు నీవు సిద్ధమేనా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు  కె. చంద్రశేఖర రావు  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు తెలంగాణ నినాదం శాశ్వతం కాదని, అభివృద్ధే శాశ్వతమంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కుమ్మక్కైనట్లు ముఖ్యమంత్రి అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు మానుకోకపోతే తగిన శాస్తి చేస్తానంటూ ధ్వజమెత్తారు. 

పరకాల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆత్మకూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్ సీఎం కిరణ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. అభివృద్ధి విషయంలో చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. "తెలంగాణ నినాదం శాశ్వతం కాదనీ, అభివృద్ధే శాశ్వతమంటూ చిలక పలుకులు పలుకుతున్న ముఖ్యమంత్రీ.. మా ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తావా?' అని నిలదీశారు. 

నీటి పారుదల రంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుగంగ ప్రాజెక్టుకు 17 టీఎంసీల నీటిని కేటాయించారని, కానీ, అనుమతులు లేకుండా 300 టీఎంసీల నీటిని తరలించుకుపోతున్నారని, ఇదేనా? తెలంగాణలో అభివృద్ధి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక సన్నాసి అంటూ వ్యాఖ్యానించారు. "నీవు మనిషివేనా!? చీము, నెత్తురు ఉంటే, మగాడివే అయితే పిట్టకథలు, కట్టుకథలు చెప్పకు. చీకటి స్నేహాలు తెలంగాణ వారికి ఉండవు. మేం ఏది మాట్లాడినా నిప్పు కణికల వలే ఉంటాయి. ఇలాంటి కుమ్మక్కులు.. సన్నాసుల్లారా మీకే అలవాటు'' ఆయన అన్నారు.

"ఢిల్లీలో ఏం జరుగుతాందో నాకు తెలుసు. కాంగ్రెస్ వణికిపోతున్నది. పరకాలలో టీఆర్ఎస్ గెలిస్తే సోనియా పిలిచి 'కేసీఆర్..! నీ తెలంగాణ నీవు తీసుకో' అంటది'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పరకాలలో 52 శాతం ఓట్ల మెజార్టీతో తెరాస గెలుస్తుందని తాను సర్వే చేయించిన ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక అందజేసిందని కేసీఆర్ వెల్లడించారు. మత భావాలను రెచ్చగొట్టడం ద్వారా మహబూబ్‌నగర్ ప్రజల్లో చీలిక తెచ్చిన బీజేపీపై పరకాలలో ఉన్న ముస్లిం సోదరులు బద్‌లా తీర్చుకునేందుకు మూకుమ్మడిగా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.