జగన్ దొంగ వైయస్ గజదొంగ

జగన్ దొంగ వైయస్ గజదొంగ

 జూన్ 15 తర్వాత రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు  కల్వకుంట్ల తారక రామారావు  గురువారం వరంగల్ జిల్లాలో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆయన మండిపడ్డారు.

ఆస్తుల కేసులో వైయస్ కేబినెట్ మంత్రులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ మీడియా వ్యవహారంలో తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని అన్నారు. బెంగళూరు, ఊటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులను సిబిఐ జప్తు చేయాలన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ బెదిరించి పెట్టుబడులు పెట్టించారని ఆరోపించారు.

పరకాలలో కొండా దంపతుల గూండాగిరికి ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. జగన్ దొంగ అయితే వైయస్ గజదొంగ అన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా అసాధరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే జూన్ 15 తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. యుపిఏ తనను తాను బతికించుకోవడానికి తెలంగాణ ఇవ్వక తప్పదన్నారు. ఆంధ్ర నాయకత్వంలో పని చేసే పార్టీలకు తెలంగాణలో ఆదరణ ఉండదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసుకు గడ్డు పరిస్థితి అన్నారు. వైయస్ హయాంలో తెలంగాణ వనరులను కొల్లగొట్టారన్నారు. సుప్రీం నోటీసులు అందుకున్న మంత్రులను ఎందుకు విచారించడం లేదన్నారు. సాక్షి విషయంలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఉద్యోగులకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో లబ్ధి పొందిన వారే జగన్ మీడియాలో పెట్టుబడులు పెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి నారాయణ హైదరాబాదులో అన్నారు. వైయస్ రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. జగన్ మీడియా వ్యవహారంలో గతంలోనే తాము ఢిల్లీలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

జగన్ అరెస్టు పైన సిబిఐ దృష్టి సారించాలని సూచించారు. పరకాల అంశం విషయంలో రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి విడిపోయిందని ఆయన అన్నారు. వారి వైఖరి కారణంగా తెలంగాణ వాదం బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అంతకు ముందు ఆయన గద్దర్‌తో భేటీ అయ్యారు. తాము  తెలంగాణ  కోసం సిపిఐతో కలిసి పని చేస్తామని గద్దర్ చెప్పారు.

సిబిఐకి ఖాతాలను ఫ్రీజ్ చేసే నైతిక హక్కు లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. సిబిఐ విచారణకు తాము అభ్యంతరం చెప్పడం లేదని, కానీ ఫ్రీజ్ మాత్రం సరికాదన్నారు.  జగన్  మీడియా సంస్థలు మూతపడితే ఉద్యోగులు రోడ్డున పడతారని ఆయన అన్నారు.