జగన్ జైలుకెళ్లడం ఖాయం: కెటిఆర్

జగన్ జైలుకెళ్లడం ఖాయం: కెటిఆర్

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బుధవారం వరంగల్ జిల్లాలో అన్నారు. ఆయన పరకాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రాంతాన్ని ప్రయోగశాలగా మార్చి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి భూములను పూర్తిగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాపాల పుట్ట పగిలి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో జగన్ పార్టీకి స్థానం లేదని పరకాలలో జరిగే ఉప ఎన్నిక ద్వారా నిరూపిస్తామని ఆయన చెప్పారు. కొండా సురేఖ జెఏసి అంటే జగన్ యాక్షన్ కమిటీ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

పరకాలలో జగన్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కొండా సురేఖను తెలంగాణ ప్రజలు గెలిపించరని చెప్పారు. కాగా అంతకుముందు కెటిఆర్ పరకాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పరకాలలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

హన్మకొండలో  తెలంగాణ  రాష్ట్ర సమితి అర్బన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజయ్య, వినయ భాస్కర్‌, మరో నేత పెద్ది సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు.