చంద్రబాబుకు మరో ఝలక్

చంద్రబాబుకు  మరో ఝలక్

 తెలుగుదేశం పార్టీకి  విజయనగరం  జిల్లాలో మరో గట్టి దెబ్బ తగిలింది. జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. అతను త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశముందని తెలుస్తోంది.

శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ఆయన ప్రభుత్వ విప్‌గా గతంలో పని చేశారు. ఇతను టిడిపికి రాజీనామా చేయడం జిల్లాలో టిడిపికి గట్టి దెబ్బే. ఇటీవలే జిల్లాకు చెందిన ముఖ్య నేత గద్దె బాబు రావు  తెలుగుదేశం  పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం బాబు రావు వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసులో చేరారు.

అప్పుడే పార్టీకి జిల్లాలో గట్టి దెబ్బ తగిలిందన్నారు. తాజాగా శంబంగి రాజీనామా మరింత దెబ్బతీస్తుందని చెబుతున్నారు. కాగా ఇటీవల సీమాంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీలోకి జోరుగా జంప్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాకు చెందిన విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిలు కూడా జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలవడం తీవ్ర వివాదాస్పదం కావడంతో వల్లభనేని వంశీ ఈ అంశంపై గురువారం హైదరాబాద్‌కు వచ్చి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం ముగిసినట్లేనని అందరూ భావిస్తున్నారు. అయితే పార్టీలో పలువురు నేతలు జగన్ వైపు వెళుతుండటం మాత్రం నేతలకు మింగుడు పడటం లేదంటున్నారు.