జగన్ బెంగళూర్ ఇంటిపై బాబు

జగన్ బెంగళూర్ ఇంటిపై బాబు

 బెంగళూరులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  గురువారం అన్నారు. చంద్రబాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ నేతలు దొంగలు అయితే  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గజదొంగలు అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన కెవిపి రామచంద్ర రావు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఆస్తుల కేసులో కెవిపి, అవినీతి మంత్రులను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద అవినీతి దేశంలో జరగలేదని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య బలమైన అనుబంధముందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. కొన్ని ఖాతాల నిలుపుదల ద్వారా అవినీతిని అడ్డుకోలేరని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. జగన్ అక్రమాస్తులపై ప్రభుత్వానివి ఉత్తుత్తి చర్యలే అన్నారు. జగన్ అవినీతి విషయంలో ప్రభుత్వం ప్రచారం తప్ప చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. సండూరు పవర్ ఆస్తులను, భారతి సిమెంట్ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. వైయస్ కుటుంబ సంస్థ సరస్వతి సిమెంట్ పైన చర్యలేవన్నారు. ప్రభుత్వం అంతా ఉత్తుత్తి చర్యలు తీసుకుంటోందన్నారు. అందుకే సాక్షి మీడియాకు ప్రభుత్వం రద్దు చేసిన ప్రకటనలకు కోర్టులో చుక్కెదురయిందన్నారు. కిరణ్, జగన్ అపూర్వ సహోదరులు అన్నారు.

జగన్, కిరణ్ కేవలం ఉప ఎన్నికల కోసమే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని  రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. అక్రమ సంపదను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.